ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో తెలియదు గాని, తన ప్రతి ప్రయాణం ఎంతో వినోదాన్ని కలిగిస్తుంటుంది. అక్కడ ఆయన మాట్లాడే తీరు ఇక్కడ స్వరాష్ట్రంలో మాట్లాడేదానికి భిన్నం. అటువంటి భిన్నత్వాలకు మూలం తన సైకాలజీలో కనిపిస్తుంది. ఒక నాయకుని సైకాలజీ, మాటల తీరుపై ఆయన ఎక్కడ మాట్లాడుతున్నారనే స్థల ప్రభావం కూడా కొంత ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు రేవంత్ రెడ్డి స్వరాష్ట్రంలో, ఇక్కడి నేల, గాలి, ప్రజలు, పార్టీవారు, నాయకులు, ప్రత్యర్థుల మధ్య ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా, పూర్తిగా తన సహజ స్వభావానికి అనుగుణంగా, ఎంతైనా రెచ్చిపోయి మాట్లాడగలరు. కానీ, ఢిల్లీ వంటి చోట్ల భావార్థాలు అవే అయినా కొంత భిన్నంగా మాట్లాడవలసి వస్తుంది.
ఇటువంటి కోణాలపై పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లు పరిశోధిస్తాయో లేదో తెలియదు. కానీ వారు, సైకాలజీ డిపార్ట్మెంట్ వారు కలిసి అధ్యయనం జరిపితే ఆసక్తికరమైన విషయాలు చాలా తెలుస్తాయి. ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. ఆయన ఈ నెల 19న ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఎఎఫ్ఐ) 12వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ గురించి, ఫ్యూచర్ సిటీ గురించి, అటువంటి మరికొన్ని విషయాల గురించి సదస్యులకు వివరించారు. ఆ స్థాయి వారికి ఇటువంటివి తెలియపరచటం ఎంతో అభినందించదగినది. కనీసం తన ఆలోచనల ప్రకా రం అవన్నీ తాను ఉద్దేశిస్తున్నవీ, మరొక రెండు పర్యాయాలు అధికారానికి వచ్చి అమలు చేయగోరుతున్నవీ అయినందున అటువంటి వివరణలు తప్పక అవసరమైనవే. కనుక ముఖ్యమంత్రిని అభినందించాలి.
ఆ విషయం అట్లుంచితే, ఢిల్లీ వంటి చోట్ల మాట్లాడటం, ప్రముఖ కంపెనీల ఉన్నతాధికారుల మధ్య ప్రసంగించటం అనే స్థల ప్రభావాలు రేవంత్ రెడ్డి సైకాలజీపై ప్రభావం చూపటమన్నది గమనించాల్సిన విషయం. అక్కడ ఆయన అకస్మాత్తుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించిన ప్రస్తావన చేశారు. ట్రంప్ విధానాలు, వాటిలోని పరస్పర వైరుధ్యాలు, ప్రధాని మోదీ గురించి ఆయన రకరకాల వ్యాఖ్యలు, సుంకాల విధింపు పద్ధతుల గురించి విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించారు. అవన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ట్రంప్ సుంకాలను ప్రస్తావించటం ఆ వాణిజ్య వర్గాల వారికి మెచ్చదగినదిగా తోచవచ్చునని తనతో పాటు తన సలహాదారులైన అధికారులు భావించి ఉంటే అది మంచిదే. కానీ సరిగా అక్కడ, రేవంత్ రెడ్డి ఆ సభ, ఆ సదస్యులను బట్టి కృత్రిమంగా తెచ్చి పెట్టుకున్న సంస్కారయుతమై న ముఖోటా నుంచి తన నిజ సంస్కారం వెలికి వచ్చింది. అట్లా రావటంతో ఆయన, తెలంగాణలోనూ ఒక ట్రంప్ ఉన్నారని, తనను ప్రజలు ఇంటికి పంపారని సదస్యులకు తెలియపరిచారు.
రేవంత్ రెడ్డి ఉద్దేశించిన తెలంగాణ ట్రంప్ ఎవరో చెప్పనక్కరలేదు. అట్లా పోల్చినందుకు యథాతథంగా ఆక్షేపించనక్కరలేదు. ఆ పోలికకు సమర్థనగా ఏవైనా వివరణలు ఇచ్చినట్టయితే. వాటిని ఎవరైనా ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కానీ వివరణలు అంటూ ఇవ్వాలి. ఆ తరహా పోలికను రేవంత్ రెడ్డి చేయటం ఇది మొదటిసారి. అందువల్ల, ఒకవేళ ఢిల్లీ సదస్సులో అందుకు సమయం లేకపోతే ఆ పని ఇప్పటికైనా చేసినట్టయితే మనం కేసీఆర్ గురించి కొత్త అవగాహనలు తెచ్చుకోవచ్చు.
ట్రంప్, కేసీఆర్‌ల మధ్య ఇటువంటి పోలికలు ఉన్నాయన్న మాట అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఒకటి కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డికి ట్రంప్ గురించి, ఆయన విధానాల గురించి, వాటి నేపథ్యాల గురించి పైపైన ఏవో నాలుగు ముక్కలు వినటం మినహా అవగాహన లేదు. కేసీఆర్ పట్ల పట్టరాని విద్వేషం, దానితో పాటు లోలోపల ఆయనంటే భయం కూడా ఉన్నాయి గనుక సందర్భం ఉన్నా లేకపోయినా, అతికినా, అతకకున్నా, ఆ విద్వేషాన్ని కక్కుతూ ఉండాలి. మనిషి ఒక స్థితికి బందీ అయి పోయినప్పుడు బలహీనుడిగా మారి, అంతకన్న భిన్నంగా వ్యవహరించలేడు. బలహీనతలే తనను నియంత్రించి నడుపుతాయి.
ఇందులో సైకాలజీ ఎక్కడ వస్తున్నదంటే, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి పట్ల సకారణంగానైనా, నిష్కారణంగానైనా వ్యతిరేకత, భయం అన్నవి ఒక పరిమితిని దాటినప్పుడు విద్వేషంగా మారుతాయి. ఆ విద్వేషం పెరిగే క్రమంలో విచక్షణను కోల్పోతాడు. అట్లా కోల్పోయినప్పుడు స్థల, కాల సందర్భ విచక్షణ ఉండదు. భాషా విచక్షణ ఉండదు. పైన పేర్కొన్నటువంటి సదస్సుల సమయంలో అవసరార్థం కొంత స్వీయ నియంత్రణను తెచ్చిపెట్టుకున్నా, అది చివరిదాకా నిలవదు. బహుశా తమకు తెలియకుండానే, అప్రయత్నంగానే కావచ్చు భంగపడిపోతుంది. తగిన సంస్కారం, విజ్ఞత గలవారు మాత్రమే స్వీయ నియంత్రణను నిలుపుకోగలరు. ఇందులో భాగంగానే అటువంటి వారికి సందర్భ శుద్ధి, సభ్యత అన్నవి ముందుకు వస్తాయి. తన మాటలు విన్నవారు ఏమనుకుంటారోననే జ్ఞానం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి ఇవన్నీ కోల్పోయారంటే తన వ్యక్తిత్వాన్ని తేలికగా అర్థం చేసుకోవచ్చు.
తన ధోరణి మున్ముందు ఇదేవిధంగా కొనసాగితే ఇంకా ఏమి మాట్లాడవచ్చునా అనిపిస్తున్నది. ఉదాహరణకు ప్రస్తుతం యూరియా కొరతతో రైతులు ఎంతగా ఆందోళన చెందుతున్నారో చూస్తున్నాము. ముందుచూపు లేమివల్ల ఆ సమస్యను సృష్టించిన రేవంత్ రెడ్డి, తీరా సమస్య వచ్చిపడిన తర్వాత ఆ నిందను తప్పించుకునేందుకు, బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్ని యూరియా కొరతను సృష్టించాయంటున్నారు. ఆ మాట ఎవరూ నమ్మటం లేదని అర్థమైనా, అంతకన్న సాకులు తోచనందున అదే మాట పదే పదే చెప్తున్నారు. కానీ, ఒక కొత్త సాకు ఎవరైనా ఆయనకు చెప్పినట్టయితే ఉపయోగం ఉండవచ్చు. అది డొనాల్డ్ ట్రంప్ – కేసీఆర్ కలిసి కుట్ర పన్నారని. వారి వల్లనే ఉక్రెయిన్ యుద్ధం, పాకిస్థాన్‌తో యుద్ధం వచ్చి ఎరువుల సరఫరా తగ్గిందని. ఆ జాబితాకు ఇప్పుడు ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడిని చేర్చవచ్చు.
రేవంత్‌రెడ్డి ఎందుకో మొహమాట పడి, ఆరు గ్యారెంటీలు, మేనిఫెస్టో అమలు వైఫల్యాలను కేసీఆర్ ప్రభుత్వం అప్పులకు మాత్రం పరిమితం చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్నటి ఢిల్లీ సదస్సుతో ట్రంప్ ప్రస్తావనతో ఆరంభించి తన మహత్తర దార్శనికత అంతర్జాతీయంగా మారినందున, దార్శనికతలలో ఎప్పుడైనా చరిత్ర కూడా మేళవించి ఉంటుంది గనుక, కేసీఆర్ తన పూర్వ జన్మల కాలంలో క్రీస్తు పూర్వం 326లో మేసిడోనియా రాజు అలెగ్జాండర్‌తో చేతులు కలిపి భారతదేశంపై దండయాత్ర జరిపారని, అదే పరంపరలో వేర్వేరు జన్మలలో వేర్వేరు విదేశీయులతో కలిసి దండయాత్రలు సాగిస్తూ పోయారని, అది ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం, పాకిస్థాన్ యుద్ధం రూపాల వరకు కొనసాగి యూరియా కొరతను సృష్టించిందని రాష్ట్ర రైతులకు బోధించవచ్చు.
భవిష్యత్తులో రాగల సమస్యలకు కూడా ఈ విధంగా అలెగ్జాండర్‌తో కలిసి కేసీఆర్ ఆరంభించిన దేశద్రోహుల పరంపరతో నాంది జరిగిందనుకోవచ్చు. తాను అప్పటి జన్మలో యూరియా కోసం అలెగ్జాండర్‌తో పురుషోత్తముని వలె వీరోచిత పోరాటం సాగించగా, కేసీఆర్ మాత్రం యూరియా కొరత సృష్టించేందుకు అంభిరాజు వలె మారారని, అదే సంప్రదాయం నేటికీ కొనసాగిస్తున్నారని గొంతెత్తి ప్రకటించవచ్చు.
సాధారణంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి స్థాయికి చేరినవారు స్వయంగానే తగు విద్యా సంస్కారాలు, అనుభవం కలిగినవారై ఉంటారు. వారి పార్టీలూ వారికి సలహాలనిస్తుంటాయి. అవసరమైనప్పుడు సరిదిద్దుతుంటాయి. అదీగాక కొందరికి స్పిన్ డాక్టర్లని ఉంటారు. వారు ఆ నాయకుని గురించి మీడియాకు, ఇతరులకు సదభిప్రాయం కలిగే సమాచారాలు, నిర్వచనాలు ఇస్తూ, వ్యతిరేక అభిప్రాయం కలుగకుండా చూస్తుంటారు.
రేవంత్ రెడ్డి విషయంలో ఈ మూడింటిలో ఏదీ ఉన్నట్టు తోచటం లేదు. స్వతహాగా తనకు ఉండవలసినవి ఎట్లాగూ లేవు. పార్టీ వైపు నుంచి రాష్ట్రస్థాయిలో గాని, ఢిల్లీ వైపు నుంచి ఏమీ జరగటం లేదన్నది స్పష్టం. సోనియాగాంధీ ఆరోగ్య సమస్యల వల్ల క్రియాశీలంగా లేరు. పార్టీ అధ్యక్షుడు నామకార్థం మాత్రమే. ఇక మకుటం లేని మహారాజు ఆ కుటుంబం పేరిట చెలామణిలో ఉండటం మినహా నిజమైన సమర్థతలు ఏవీ లేవని గత 20 ఏండ్లలో తేలిపోయింది. రాష్ట్రస్థాయిలో చూసినప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని స్వీయ ప్రయోజనాభిలాషులు తప్ప తన శ్రేయోభిలాషులు లేరు. రేవంత్ సహా అందరికీ అధికార నిబద్ధతలు తప్ప, కాంగ్రెస్‌కు ఈ రోజున గల సిద్ధాంతమేమిటో తెలియదు గనుక సైద్ధాంతిక నిబద్ధతలేమీ ఒకప్పటి వలె లేవు.
అటువంటి పరిస్థితుల మధ్య రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఒక సహజమైన పతన పరిణామం వంటిదే తప్ప అందులో ఆశ్యర్యపడవలసింది ఏమీ లేదు. అటువంటి నాయకుని వ్యవహరణ ఇట్లుండటంతో పాటు తన సైకాలజీ, భాష ఈ విధంగా రూపు తీసుకోవటం కూడా సహజ క్రమమే. అందువల్ల ఆయనను చూసి అలెగ్జాండర్ నుంచి మొదలుకొని, డొనాల్డ్ ట్రంప్, కేసీఆర్‌ల వరకు అందరూ సానుభూతి చూపాలి. మరోవిధంగా ఏమీ అనుకోనక్కరలేదు. పై సదస్సులో పాల్గొన్నవారు కూడా బహుశా సానుభూతి మాత్రమే చూపి ఉంటారు తప్ప మరేమీ అనుకొని ఉండరు.
– టంకశాల అశోక్