వాషింగ్టన్: ఇంట్లో తక్కువ మొక్కలుంటే మన మనః స్థితి(మూడ్) బాగుంటుందని, ఒక గదిలో చాలా మొక్కలుంటే అది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుందని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం వెల్లడించింది. మనుషులు ఇండ్ల లోపల ఎంత మేరకు పచ్చదనం, కలప సామాగ్రిని చూడగలరనే విషయంలో కొత్త మార్గాన్ని అధ్యయన బృందం అభివృద్ధి చేసింది. ‘ఇంటి లోపలి ప్రకృతి’లోని వివిధ స్థాయిలు మనుషుల సంపూర్ణ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాన్ని పరిశీలించడానికి వారు ఈ పద్ధతిని ఉపయోగించారు. కొన్ని మొక్కలు, కిటికీ నుంచి చెట్లను చూడటం ఈ అధ్యయనంలో పాల్గొన్నవారికి విశ్రాంతి కలిగించాయి. అయితే మొక్కల సంఖ్యను పెంచిన కొద్దీ వారు ఒత్తిడికి గురవడం మొదలు పెట్టారు.
ఒక గదిలో 60 శాతం స్థలాన్ని మొక్కలు, కలపతో నింపేసినప్పుడు ఆ గదిలోని వారి ఒత్తిడి స్థాయిలు అత్యంత ఎక్కువ స్థాయికి చేరుకున్నాయని అధ్యయన రచయిత ఎవా బియాన్చి తెలిపారు. ఈ అంశంపై చాలా పరిశోధనలు జరిగాయని.. అయితే విభిన్న పద్ధతుల వల్ల ఫలితాలను ప్రత్యక్ష పోలికలు చేయలేమని మరో రచయిత సారా బల్లింగ్టన్ అన్నారు. ఈ అంతరాలను తొలగించడానికి ‘నేచర్ వ్యూ పొటెన్షియల్’ అనే సాఫ్ట్వేర్ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. గదిలో ఉండే సహజమైన అంశాలు మానసిక ఆరోగ్యానికి లాభదాయకమని ఈ అధ్యయనం తెలియజేసింది.