బంట్వారం, నవంబర్ 9 : గత కొన్నేళ్లుగా మండలంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉండగా.. ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. స్థానిక పార్టీ అధ్యక్షుడి వింత పోకడలతో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా మారింది. ఇందుకు తాజాగా జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే ఇట్టే అర్థమౌతుంది. శనివారం సీఎం రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలను మండలంలో రెండు వర్గాలుగా చీలిపోయి నిర్వహించారు. ఒక వర్గం స్థానిక బస్స్టాండ్ పరిసరాల్లో.. మరో వర్గం స్థానిక కేజీబీవి పాఠశాలలో నిర్వహించాయి. గతంలో జిల్లా మొత్తానికి బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఎంపీపీలు, జడ్పీటీసీలే గెలుపొందారు. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ మండలంలో ప్రస్తుతం రెండు వర్గాలు ఏర్పడటంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
అధిష్ఠానం చెప్పినా కుదరని సయోధ్య
సీఎం రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలను వేర్వేరుగా చేయడంతో అధిష్ఠానం తీవ్ర అసహనంతో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇరు వర్గాలను సముదాయించి ఒకే వేదికలో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సూచించినా వారు పట్టించుకోలేదు. ఈ విషయంలో మండలానికి చెందిన జిల్లాస్థాయి నాయకుడిని పలుకరించగా, తాము పార్టీని రెండు వర్గాలు చేయడం లేదని, కేవలం పార్టీ అధ్యక్షుడి పోకడతోనే ఇలా పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సి వస్తున్నదన్నారు. తమ మాటలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవాలని, లేకపోతే ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందన్నారు. తామేమీ పార్టీకి వ్యతిరేకం కాదని, స్థానిక నాయకత్వానికే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు.