పాన్‌గల్/బాసర, ఫిబ్రవరి 25 : ప్రేమికులు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. తండావాసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం అన్నారం తండాకు చెందిన లోక్యానాయక్, చిట్టెమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు జీవనోపాధి కోసం మహారాష్ట్రలోని బారామతికి వలస వెళ్లారు. పెద్ద కూతురు ఆర్ వసంత (18) నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఈసీఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది.
కాగా వనపర్తి మండలం అప్పాయిపల్లి పంచాయతీలోని కీర్యా తండాకు చెందిన గణేశ్ నాయక్ (19) పదోతరగతి వరకు చదివి హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నాడు. గణేశ్, వసంత బంధువులు కావడంతో అప్పుడప్పుడు కలుసుకోవడంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. గణేశ్ హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన కీర్యాతండాకు మంగళవారం రాత్రి చేరుకొన్నాడు. అదే సమయంలో వసంత గణేశ్‌తో ఫోన్లో మాట్లాడగా, ఇంతలోనే అతడు ఫోన్ నంబర్‌తోపాటు వాట్సాప్ కూడా బ్లాక్ చేయడంతో ఆమె మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం.
ఆ వెంటనే గణేశ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం తెల్లవారుజామున ఈ విషయం తెలుసుకొన్న వసంత దిగ్భ్రాంతికి గురై బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. కేర్‌టేకర్ విజయ్ గమనించి వెంటనే ఉన్నతాధికారులకు, బాసర పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉన్నదని, కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు బాసర ఎస్సై నవనీత్‌రెడ్డి పేర్కొన్నారు.