శంకర్పల్లి నవంబర్ 9 : ‘ఛేంజ్ యువర్ గేర్’ అనే థీమ్‌తో హెచ్‌సీఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో నిర్వహించిన సైక్లోతాన్ సైక్లింగ్ పోటీలు విజయవంతంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి 1900 మందికి పైగా ప్రొఫెషనల్, అమెచ్యూర్ సైక్లిస్టులు, ఫిట్నెస్ ప్రియులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సైక్లిస్టులు వివిధ విభాగాల్లో పోటీపడి రూ.33.6 లక్షల రికార్డు స్థాయి బహుమతి కోసం తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీఎల్ సైక్లోతాన్ వంటి ఈవెంట్లు ఫిట్నెస్, సైస్టెనబిలిటీ, కమ్యూనిటీ వెల్బీయింగ్లపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సైక్లింగ్ ఉత్సాహాన్ని పంచుకోవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రెసిడెంట్ సందర్ మహాలింగం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ సైక్లోతాన్ రెండో ఎడిషన్ విజయవంతంగా ముగియడం గర్వకారణం. సైక్లింగ్ ఇప్పుడే దేశవ్యాప్తంగా ఒక సాంఘిక ఉద్యమంగా మారింది.
ప్రారంభంలో క్రీడా కార్యక్రమంగా మొదలైన ఈ యత్నం, ఇప్పుడు దేశవ్యాప్తంగా 16000 మందికి పైగా రైడర్లను కలిపే కమ్యూనిటీగా ఎదిగింది. హైదరాబాద్‌లో కనిపిస్తున్న ఉత్సాహం, సైక్లింగ్ కేవలం పోటీ మాత్రమే కాకుండా ఆరోగ్యం, పట్టుదల, సమాజంతో అనుబంధానికి మంచి గుర్తింపునిస్తుందన్నారు. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మనీందర్‌సింగ్ మాట్లాడుతూ.. హెచ్‌సీఎల్ సైక్లోతాన్ రెండో ఎడిషన్ భారతదేశంలో సైక్లింగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమని తెలిపారు.