ములుగు, జనవరి 23(నమస్తేతెలంగాణ) : మేడారం మహా జాతరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ జిల్లాల నుంచి 4 వేల ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనున్నారు. గత జాతరలో 3491 బస్సుల ద్వారా 16.82 లక్షల మంది ప్రయాణికులను చేరవేయగా, ప్రస్తుతం 20లక్షల మంది భక్తులను తరలించనున్నారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ రీజియన్ నుంచి బస్సులను కేటాయించారు. మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేసి 9 కిలోమీటర్ల పొడవుతో 50క్యూలను ఏర్పాటు చేశారు.
ఇందులో ఒకేసారి 20వేల మంది భక్తులకు వసతి కల్పించనున్నారు. ప్రయాణికుల నిరీక్షణ, సిబ్బంది విశ్రాంతి గదులు, నిర్వహణ కార్యకలాపాల కోసం 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. వెయ్యి బస్సుల పార్కింగ్ కోసం మేడారంతో పాటు కామారంలో సౌకర్యాలు కల్పించారు. 7వేల మంది డ్రైవర్లు, 1811 మంది కండక్టర్లు, 759 మంది భద్రతా సిబ్బం ది, 153 మంది అధికారులతో కలిసి మొత్తం 10,441 మంది ఉద్యోగులకు విధులు కేటాయించారు. ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు ఏర్పడకుండా పెట్రోలింగ్ పార్టీని సైతం నియమించారు.