సిద్దిపేట,జనవరి 23: రాజ్యాంగం దేశ పౌరులకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హకు అని సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.హైమావతి అన్నారు. ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మతం, జాతి, కులం, వర్గం, భాష, ఎలాంటి భేదం లేకుండా రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్య్రానికి పూర్వం కొన్ని ఉన్నత వర్గాలు, ధనవంతులకు మాత్రమే ఓటు హకు ఉండేదని, స్వాతంత్య్రం అనంతరం 25 జనవరి 1950 నాడు భారత రాజ్యాంగం 21 ఏండ్లు నిండిన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పించిందన్నారు.
దానికి గుర్తుగా 2011 సంవత్సరం నుంచి ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఓటు హకు వయసును 18 ఏండ్ల కు ప్రభుత్వం కుదించిందన్నారు. మంచి వ్యక్తులకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ)అబ్దుల్ హమీద్, డీఆర్వో నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్ పాల్గొన్నారు.