సంగెం, జనవరి 23 : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వరద కాల్వ పనులను నిలిపివేయడం దురదృష్టకరమని, ఇది రేవంత్ సర్కారు అసమర్థ పాలనకు నిదర్శమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. సంగెం, గీసుగొండ మండలాల్లోని పార్కులోని వరద కాల్వను, కిటెక్స్ కంపెనీ ప్రహరీని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కలల ప్రాజెక్టుగా నిరుద్యోగుల కోసం కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేశారని, ఆయన ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని చెప్పారు.
వర్షాకాలంలో టెక్స్టైల్ పార్కులోని కిటెక్స్, యంగ్వన్, గణేషా కంపెనీల్లో వరదనీరు చేరిందని, దాన్ని చూసి వచ్చే కంపెనీలు ఇక్కడికి రావడానికి జంకుతున్నాయని పేర్కొన్నారు. వరద కాల్వ పనులు చేసేందుకు రూ.160.92 కోట్లు పరిపాలనా ఆమోదం ఇచ్చి టెండర్లు ఆహ్వానించి పనులు కూడా చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ పనులను నిలిపివేయడం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందని చల్లా మండిపడ్డారు. వెంటనే నిధులు మంజూరు చేసి వరద కాల్వ బలోపేతం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, లేదంటే భూ నిర్వాసితులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
అదేవిధంగా యంగ్వన్ కంపెనీని సందర్శించి, యజమానులతో కలిసి పరిశ్రమలో కొనసాగుతున్న ఉత్పత్తి, కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు, ఉపాధి అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సంగెం మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, మాజీ జడ్పీటీసీలు గూడ సుదర్శన్ రెడ్డి, పోలీసు ధర్మారావు, ముంత రాజయ్య, గుర్రం రఘు, కొనకటి మొగిలి, మాజీ సర్పంచ్ బాబు, ఉపసర్పంచ్ పోశాల సతీశ్, వేల్పుల కుమారస్వామి, శివ, జక్క మల్లయ్య, రమేశ్‌బాబు పాల్గొన్నారు.