ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. ఫలితంగా ఈ రహదారులపై ప్రయాణం చేయాలంటే వాహనదారులకు, ప్రయాణికులకు నరకం కన్పిస్తోంది. గత 15 రోజుల నుంచి వరుసగా కురిసిన వర్షాల వల్ల ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారుల పైనుంచి వర్షపు నీరు ప్రవహించింది. దీంతో పలు చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాటిపై నుంచే వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ఆ గుంతలు మరింత పెద్దవై ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా ఖమ్మం – బోనకల్లు మార్గంలో ప్రధాన రహదారిపైకి వర్షపునీరు చేరడంతో ఆ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ఉమ్మడి జిల్లాలో ఈ తరహాలో అనేక ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం కనీసంగా కూడా తాత్కాలిక మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు పడిన రోడ్లపై ప్రయాణించేందుకు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ గుంత ద్వారా ఏ ప్రమాదం పొంచి ఉందోననే భయం వెంటాడుతోంది.
-ఖమ్మం, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, రఘునాథపాలెం, బోనకల్లు, తిరుమలాయపాలెం, చండ్రుగొండ, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రధాన రహదారులు కోతకు గురై దెబ్బతిన్నాయి. ములకలపల్లి మండలంలోని మాధారం – ములకలపల్లి ప్రధాన రహదారిపై పాములేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ రహదారి తీవ్రస్థాయిలో కోతకు గురైంది. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణం కొనసాగించడం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అలాగే, ములకలపల్లి – అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట – పాల్వంచ రహదారులు సైతం దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేసే పరిస్థితి లేకపోవడంతో వాహనదారుల ఒళ్లు హూనమవుతోంది. ఇదే పరిస్థితి అన్నపురెడ్డిపల్లి – మర్రిగూడెం ప్రధాన రహదారినూ ఉంది.
ఈ రహదారిపై అనేకచోట్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడినా ఇంత వరకూ మరమ్మతులకు దిక్కులేకుండా పోయింది. చండ్రుగొండ మండలంలో పలు ప్రధాన రహదారులు సైతం తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లాలోని కేవలం మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోనే 126 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమైనట్లు రహదారులు, భవనాల శాఖ అధికారుల అధికారులు గుర్తించారు. వీటి తక్షణ మరమ్మతులకు రూ.14 కోట్లు అవసరమని నిర్ధారించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు. ఏటా వర్షాకాలంలో రఘునాథపాలెం మండలంలోని వీఆర్ బంజర – పాపటపల్లి మీదుగా బుగ్గవాగు ప్రవహిస్తుంటుంది.
దీంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఆ సమయంలో పాఠశాలల బస్సులు కూడా ఈ మార్గంలో ప్రయాణించవు. దీంతో విద్యార్థుల్లో ఆ సమయంలో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లలేకపోతుంటారు. ఈ రోడ్డులో బుగ్గవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. కాగా, దెబ్బతిన్న రహదారులకు తక్షణం మరమ్మతులు చేయకపోతే మళ్లీ వర్షాలు కురిస్తే ఈ రహదారులు మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి నెలకొంటుందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఇసుక లారీల వల్ల రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయి. చర్ల – భద్రాచలం ప్రధాన రహదారిపై తూరుబాక, చర్ల, పర్ణశాల గ్రామాల వద్ద రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. చర్ల – భద్రాచలం మార్గంలో ప్రయాణమంటేనే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. చర్ల మండలంలోని మొగళ్లపల్లి, వీరాపురం, గొల్లగూడెం గ్రామాల వద్ద ఇసుక ర్యాంపులు ఉన్నాయి. లారీల ద్వారా ఇక్కడి నుంచి ఇసుక సరఫరా అవుతుంటుంది. దీంతో ఆ లారీల అధిక లోడు కారణంగా రహదారులు తీవ్రంగా ధ్వంసమవుతున్నాయి.
వర్షాలు పడి గోదావరి పెరగడంతో గత పదిహేను రోజులుగా ర్యాంపులు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉధృతి తగ్గాక ప్రభుత్వం కనీస మరమ్మతులు కూడా చేయలేదు. ఇప్పుడు మళ్లీ వాహనాలు తిరుగుతుంతో రహదారులు మరింత దెబ్బతింటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సహా పలు పార్టీల నాయకులు ఈ రహదారులపై ఆందోళనలు చేశాయి. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశాయి. అయినా ప్రభుత్వం నుంచి చర్యలు శూన్యం కావడంతో ఇక్కడి ప్రజలు మండిపడుతున్నారు.
చండ్రుగొండ, సెప్టెంబర్ 7: అశ్వారావుపేట శాసనసభ్యుడు జారే ఆదినారాయణ దత్తత గ్రామానికి వెళ్లే రహదారికి మరమ్మతులు చేయాలని, శాశ్వతంగా బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆ రహదారిపై నిలబడి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మహమ్మద్ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, కొత్తగా బీటీ రోడ్డు నిర్మిస్తామని ఎన్నికల సమయంలో జారే ఆదినారాయణ హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మట్టి రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చి వేయాలన్నారు.
చండ్రుగొండ: నిరసన తెలుపుతున్న గ్రామస్తులు
దుమ్ముగూడెం వద్ద దెబ్బతిన్న రహదారి
దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద దెబ్బతిన్న రహదారి
ఖమ్మం నగరంలో దెబ్బతిన్న రోడ్డు
ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పడిన భారీ గుంతలు