‘పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా..’ అనే పాట ఉమ్మడిరాష్ట్రంలో వినిపించని రోజు లేదు. సాగునీటికి నోచుకోక.. చేతిలో పనుల్లేక పొట్టచేత పట్టుకొని ఊరుదాటిన వారితో మహబూబ్‌నగర్ వలసల జిల్లాగా మారింది. ఉమ్మడి పాలకులు దశాబ్దాలుగా పడావు పెట్టిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే పట్టాలెక్కించి 95 శాతం పూర్తి చేయించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు, డిస్ట్రిబ్యూటరీలను పూర్తిచేసి, వెయ్యికి పైగా చెరువులను పునరుద్ధరించి లక్షలాది ఎకరాలకు జీవం పోశారు. బీడువారిన భూములకు నీళ్లు రావడంతో వలసజీవులంతా సొంతూర్లకు తిరిగి వచ్చి దర్జాగా వ్యవసాయం చేపట్టారు. ఇప్పుడు ‘పల్లెపల్లెనా పంటలు మొలిచే పాలమూరులోనా’ అని పాడుకుంటున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పాలమూరు వలస మారింది. ప్రజల గోస తీరింది. ప్రత్యేక తెలంగాణ వచ్చాక పచ్చబడ్డ తెలంగాణ సాక్షిగా, కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులే సాక్ష్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జీవన చిత్రమే పూర్తిగా మారిపోతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడం, చెరువులను పునరుద్ధరించడం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను అందుబాటులోకి తేవడంతో పాలమూరు వలసలు తగ్గుముఖం పట్టాయి.
ఫలితంగా వలసల్లో మగ్గుతున్న జనం సొంతూళ్లకు వచ్చి దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయం వృద్ధి చెందడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. ఇవీ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) నిర్వహించిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు. తెలంగాణ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ సహకారంతో సెస్ బృందం ఈ అధ్యయనం చేపట్టింది.
‘ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామీణుల జీవితంపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభావం’ పేరిట చేపట్టిన అధ్యయనంతో రూపొందించిన నివేదికను సెస్ ఇటీవలే విడుదల చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు అందుబాటులోకి రావడంతో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతగానో మారాయని తెలిపిం ది. ఉమ్మడి పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములున్నాయి. సారవంతమైన ఎర్ర, నల్లరేగడి భూములున్నాయి.
కృష్ణ, తుంగభద్ర, భీమా, దుందుబి.. తదితర అపార నీటి వనరులు ఆ జిల్లాకు అందుబాటులో ఉన్నా యి. కోనసీమగా విలసిల్లాల్సిన పాలమూరు.. ఉమ్మడి పాలనలో కరువుకు నెలవైంది. వలసల జిల్లా అనే పేరును మూటగట్టుకున్నది. దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన జిల్లాలుగా తొమ్మిదింటిని గుర్తిస్తే అందులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఒకటిగా ఆనాడు నిలిచిందంటే ఎంత దుర్భిక్ష పరిస్థితులు ఉండేవో అర్థం చేసుకోవచ్చు. 40 లక్షలు గల జిల్లా జనాభాలో సగానికిపైగా జనాభా పొట్టచేతపట్టుకుని వలసల్లో మగ్గాల్సిన దుస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో మారిన పాలకులు.. జిల్లాను దత్తత తీసుకున్నవారూ ఉన్నారు. అయినా కరువు పోలేదు. ప్రజల బతుకులూ మారలేదు. వలస బతుకు తప్పలేదు.
కేసీఆర్ వచ్చాకే పట్టాలెక్కిన లిఫ్ట్ ప్రాజెక్టులు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. వలసల నివారణకు బహుముఖ వ్యూహాలను అమలుచేశారు. ఉమ్మడి పాలకులు దశాబ్దాలుగా పడావు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను పట్టాలెక్కించారు.
కేవలం రెండేండ్లలోనే మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టు పనులను 50 శాతం నుంచి 95 శాతానికి పూర్తిచేశారు. దీంతో 2016-17లో కల్వకుర్తి ద్వారా 1.6 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షల, రాజీవ్ భీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ ద్వారా 8 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు.. మొత్తంగా 4 ఎత్తిపోతల పథకాల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు తొలిసారిగా సాగునీటిని అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కింది.
క్రమంగా డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తిచేయడంతో ఆయా ప్రాజెక్టుల కింద 2017-2018లో 6.5 లక్షల ఎకరాలకు, 2018-2019లో 8 లక్షల ఎకరాలకు సాగునీటి విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. నికరంగా ప్రస్తుతం 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నది.
అవిగాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 1000కి పైగా చెరువులను కేసీఆర్ హాయంలోనే పునరుద్ధరించారు. వాటిని సైతం ఎత్తిపోతల పథకాలతో అనుసంధానం చేశారు. నీటిసంరక్షణ చర్యల ఫలితంగా భూగర్భజలాలు పెరిగి బోరుబావుల కింద సైతం సాగువిస్తీర్ణం క్రమంగా పెరిగింది. నీటిపారుదల వ్యవస్థ అందుబాటులోకి రావడంతో వలస వెళ్లిన వారు తిరిగి రావడం ప్రారంభమైంది. వారంతా సొంతూళ్లలో దర్జాగా వ్యవసాయాన్ని చేపట్టారు.
నాలుగు ప్రాజెక్టుల పరిధి గ్రామాలపై స్టడీ
పూర్తి చేసిన 4 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులైన రాజీవ్‌భీమా, కల్వకుర్తి, జవహార్ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా వాటి పరిధిలోని గ్రామాల్లో వచ్చిన మార్పులపై సెస్ అధ్యయనం చేసింది. అందుకోసం ఆయా ప్రాజెక్టుల పరిధిలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో 5 మండలాల నుంచి 15 గ్రామాలు, గద్వాల్ జిల్లాలో 2 మండలాల నుంచి 6 గ్రామాలు, వనపర్తి జిల్లాలో 2 మండలాల నుంచి 6 గ్రామాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక మండలం నుంచి 3 గ్రామాల చొప్పున ఎంపిక చేసింది. ఒక్కో గ్రామం నుంచి 30 ఇండ్ల చొప్పున మొత్తంగా 900 గృహాలను సర్వే కోసం సెస్ బృందం ఎంపిక చేసుకున్నది.
ఆయా గృహాలకు చెందిన వారిలో విభిన్న తరగతులకు చెందిన వారు ఉండేలా చూసుకున్నది. ప్రధానంగా సర్వేకోసం ఎంపిక చేసుకున్న వారిలో రైతులు 34 శాతం మంది (5 ఎకరాల కంటే తక్కువ ఉన్నవారు 20 శాతం, 5 ఎకరాలకంటే ఎక్కువున్న రైతులు 14 శాతం), వేతన కార్మికులు 46 శాతం, సంప్రదాయ కుల ఆధారిత వృత్తులు చేసుకునేవారు 20 శాతం మంది ఉన్నారు.
అధ్యయనం కోసం 2016-17 ముందు, 2021-22 తర్వాత వలసల పరిమాణాన్ని పరిశీలించింది. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ, కార్మికశాఖ తదితర విభాగాలు ప్రచురించిన నివేదికలను సైతం సెస్ బృందం అధ్యయనం చేసింది. డాటాను సేకరించి విశ్లేషించింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా వచ్చిన మార్పును అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది.
ఇతర రంగాల్లో ఉపాధి
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల రైతులు 2 సీజన్లలో వ్యవసాయం చేయడం వల్ల వలసలు తగ్గాయి. శ్రామికశక్తి గ్రామంలో లాభదాయకమైన ఇతర ఆర్థిక కార్యకలాపాలైన నిర్మాణ పనులు, స్వయం ఉపాధి, సంప్రదాయ వృత్తులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లోనూ పాల్గొని ఉపాధి పొందే అవకాశం ఏర్పడింది. ఇదంతా స్వల్పకాలంలోనే అంటే 2015 నుంచి ఆ జిల్లాలు కొత్తగా నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాతేనని తేల్చింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు సంబంధించి ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్, నీటి సమర్థవంత వినియోగం, పంట నమూనాల మార్పు తదితర వాటిని మెరుగుపరిస్తే ప్రాజెక్టుల ప్రయోజనాలు మరింత పెరుగుతాయని సైతం సెస్ బృందం అధ్యయనంలో వెల్లడించింది.
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో మరికొన్ని ప్రయోజనాలు
సాగు పెరిగింది.. వలస తగ్గింది
సెస్ నివేదిక ప్రకారం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలోని సాగువిస్తీర్ణం పెరిగింది. వలసలు తగ్గిపోయాయి. భూమిని సాగుచేసే రైతుల సంఖ్య 58% నుంచి 84 శాతానికి పెరిగింది. మెట్టభూముల సాగు 44% నుంచి 16 శాతానికి తగ్గింది. నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడడంతో భూ మి కౌలు కూడా పెరిగింది. తద్వారా దా దాపు 30% మంది రైతులు ప్రయోజనం పొందారు. 2016-17లో అది 5% మా త్రమే. భూగర్భ జలవనరుల ద్వారా వ్యవసాయం చేసే రైతులు 47 శాతానికి పెరిగారు.
వర్షపాతంపై ఆధారపడిన రైతులు 45% నుంచి 20 శాతానికి తగ్గిపోయారు. ఉమ్మడి మహబుబ్‌నగర్ జిల్లాలోని వలస వెళ్లిన వారిలో 20% కుటుంబాలు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వారిలో 57% మంది కూలీలు, 28% మంది రైతులు, 14% మంది సంప్రదాయ కులవృత్తిదారులు ఉన్నారు. సెస్ బృందం అధ్యయనం ప్రకారం 2000 సంవత్సరంలో వలస వెళ్లి తిరిగొచ్చిన వారు 36.9% మంది ఉంటే, 2010-16 మధ్య 28.5% మంది, 2016-22 మధ్య 16.2% మంది మాత్రమే తిరిగి వలస వెళ్లారు.
ఆ నాలుగు లిఫ్ట్ ప్రాజెక్టులతో జరిగిన మార్పులు
Pp