ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
వరదల నుంచి ద్విచక్ర వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సులు, ఆటోలు అతి కష్టంగా వెళ్తున్నాయి. వర్షాలతో దెబ్బతిన్న కొన్ని రహదారులకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నా, ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ రోడ్లను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పనులు చేపట్టి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
– ఆదిలాబాద్/నిర్మల్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గల ఆదిలాబాద్ రూరల్, బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, బజార్హత్నూర్ మండలాల పరిధిలోని 24 ప్రాంతాల్లో 43 కిలోమీటర్ల మేర రహదారులు, 28 కల్వర్టులు, 10 లో-లెవల్ వంతెనలు దెబ్బతిన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.3.70 కోట్లు, పర్మినెంట్ పనులకు రూ.58.80 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
భారీ వర్షాల కారణంగా రోడ్లు భవనాల శాఖ పరిధిలో రహదారులు, వంతెనలకు నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ గ్రామీణం, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నేరడిగొండ, తాంసి, తలమడుగు మండలాల్లో 145 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 28 కాజ్‌వేలు, 14 కల్వర్టులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. తాత్కాలిక మరమ్మతు కోసం రూ.3.15 కోట్లు, శాశ్వత పనుల కోసం రూ.70.20 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 67 ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమైనట్లు గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు.. తాత్కాలిక మరమ్మతు కోసం రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలకు ఆమోదం లభించకపోవడంతో కొన్ని చోట్ల గ్రామస్తులే సొంత ఖర్చులతో రోడ్లకు మరమ్మతులు చేసుకుంటున్నారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో 22 చోట్ల రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు.
37 ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఆయా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. 12 చోట్ల రోడ్లు పూర్తిగా తెగిపోవడంతో రాకపోకలు నిలిచాయి. ఆయా రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు రూ.2.20 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. రోడ్లను శాశ్వతంగా బాగు చేయాలంటే రూ.13.86 కోట్లు అవసరమవుతాయని అంచనాలు పంపారు. అయితే ఆయా ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో రోడ్ల మరమ్మతు పనులు జరగడం లేదు.
సొంతంగా రిపేర్ చేసుకున్నం
ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు పేండ్‌పెల్లి నుంచి సాథ్ గాం వరకు రోడ్డు పూర్తిగా కొట్టుకు పోయింది. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతినడంతో సాథ్గాం వెళ్లాలంటే గంటకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తున్నది. దీంతో గ్రామస్తు లందరం కలిసి లక్ష రూపాయలు సొంతంగా వేసుకుని రోడ్డును బాగు చేసుకున్నం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకునేటోళ్లే లేరు. వీడీసీలో తీర్మానం చేసి మొరం పోసుకొని బ్లేడ్ ట్రాక్టర్‌తో రోడ్డును వేసుకున్నం. గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తడంతో ఆ నీటి ప్రవాహానికి మా మండలంలో చాలా రోడ్లు చెడిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లను బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయాలి.
– రాచర్ల రవీందర్, పేండ్‌పెల్లి ( భైంసా మండలం)