ముదిగొండ, సెప్టెంబర్ 7: ముదిగొండ మండల రైతులు కూడా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కొన్ని సొసైటీల కేంద్రాల వద్ద ‘ఒక్క కట్ట ఇవ్వండి విక్రమార్కా’ అంటూ డిప్యూటీ సీఎంను వేడుకుంటున్నారు. ముదిగొండ మండలంలోని ముదిగొండ, మేడేపల్లి, బాణాపురం సొసైటీ కేంద్రాల వద్ద ఆదివారం కూడా రైతులు యూరియా కోసం అరిగోస పడ్డారు. ఈ కేంద్రాల వద్ద మండల రైతులు ఆదివారం ఉదయాన్నే బారులు తీరారు. ‘అందుబాటులో ఉన్నంత వరకూ ఒక్కొక్కరికీ ఒక్క కట్ట మాత్రమే ఇస్తాం. మిగిలిన వారు మళ్లీ రావాలి’ అంటూ సొసైటీల అధికారులు స్పష్టంచేయడంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.
స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే తాము ఇవ్వగలమని, స్టాక్ మళ్లీ వస్తూనే ఉంటుందని అధికారులు అన్నారు. స్టాక రాగానే రైతులు కూడా వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పుడు యూరియా అందని రైతులకు రసీదులు ఇస్తామని, వారు మళ్లీ వచ్చి యూరియాను తీసుకెళ్లాలని అన్నారు. అయితే, ‘అయిదు నుంచి ఎనిమిది ఎకరాల వరకూ సాగు చేస్తున్న మాకు ఒక్క కట్ట ఇస్తే ఎలా?’ అంటూ కొందరు రైతులు అధికారులను ప్రశ్నించారు. అయితే, ‘అందరికీ అందాలన్న ఉద్దేశంతోనే ఉన్నంతలో ప్రతి ఒక్కరికీ ఇస్తున్నాం’ అంటూ అధికారులు సమాధానమిచ్చారు. అయితే, మండలంలోని ఓ సొసైటీ వద్ద చూసినా పొలీసు బందోబస్తు లేకుంటే యూరియాను పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది.