అశ్వారావుపేట, సెప్టెంబర్ 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం పొడిగింపునకు సర్కార్ నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న జిల్లా అధికారులు వాటిని పెండింగ్‌లో పెట్టారు. జిల్లాలో మొత్తం 21 సహకార సంఘాలకు గాను 13 సంఘాల పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. దీంతో పెండింగ్‌లో ఉన్న సొసైటీల చైర్మన్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న సంఘాల వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఎక్కడ రాజకీయ వత్తిడికి గురికావాల్సి వస్తుందేమోనని ఆందోళనలో ఉన్నారు.
జిల్లాలో పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం రెండోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఆగస్టు 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అవినీతి ఆరోపణలు, నిధులు దుర్వినియోగం వంటి ఆరోపణలతోపాటు సంఘం నష్టానికి కారణమైన పీఏసీఎస్‌లకు పదవీకాలం పొడిగింపునకు అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించింది. ప్రత్యామ్నాయంగా పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించాలని సూచించింది. ఇదే విషయాన్ని సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొంది. దీనిప్రకారం విచారణ నిర్వహించిన జిల్లా ఉన్నతాధికారులు ఒక జాబితాను సిద్ధం చేసి రాష్ట్ర అధికారులకు నివేదిక అందజేశారు. పనితీరు ఆధారంగా పీఏసీఎస్‌ల పదవీకాలం పొడిగింపునకు సర్కార్ పలు నిబంధనలు నిర్దేశించింది. దీనికి అనుగుణంగా జిల్లాలో మొత్తం 21 పీఏసీఎస్‌లు ఉండగా వీటిలో 13 సంఘాల పదవీకాలం పొడిగింపు ప్రక్రియను పూర్తిచేశారు.
అవినీతి ఆరోపణలు, నిధులు దుర్వినియోగం, బకాయిల వసూళ్ళలో నిర్లక్ష్యం వహించిన మిగతా 8 పీఏసీఎస్‌లను పెండింగ్‌లో పెట్టారు. వీటి పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు వ్యవహారంలో తదుపరి ఆదేశాల కోసం అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మండల స్థాయిలో రైతులకు సాగు అవసరమైన పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించటంలో పీఏసీఎస్‌లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఐదేళ్లకు ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పీఏసీఎస్ పాలకవర్గాలు ఎన్నుకోబడతాయి. సంఘం పరిధిలోని రైతు ఓటర్లు డైరెక్టర్లను ఎన్నుకుంటారు.
ఎన్నికైన డైరెక్టర్లు చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020 ఫిబ్రవరిలోనే ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలు ఎన్నికయ్యాయి. వీటి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగిసింది. కానీ ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలలపాటు పదవీ కాలం పొడిగించింది. ఇదీకూడా ఆగస్టుతో గడువు ముగిసింది. మళ్లీ ఆగస్టు 14వ తేదీన మరో 6 నెలలు పదవీ కాలం పొడిగిస్తూ డీఫాల్ట్ పీఏసీఎస్‌లకు అవకాశం ఇవ్వొద్దని మెలికపెట్టింది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో పేర్కొంది.
సహకారశాఖ కొత్త నిబంధనల ప్రకారం పనితీరు బాగున్న పీఏసీఎస్‌ల పాలకవర్గాలకు మాత్రమే పదవీకాలం పొడిగించింది. పది అంశాలతో కూడిన నిబంధనల ప్రకారం పీఏసీఎస్‌లను అధికారులు రెన్యువల్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్న 8 పీఏసీఎస్‌లను పెండింగ్‌లో పెట్టారు. వీటిపై తదుపరి చర్యలు సూచించాల్సిందిగా ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. వీటి పరిధిలో అవినీతి ఆరోపణలు, నిధులు దుర్వినియోగం, పాత బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం, రుణాల చెల్లింపులో అక్రమాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను సిద్ధం చేశారు.
అదేవిధంగా లాభాలు తగ్గి నష్టం వచ్చిన సొసైటీలు, బ్యాంక్‌లకు చెల్లించాల్సిన రుణాల్లో తేడాలు, రుణ రికవరీశాతం తగ్గటం, పాలకవర్గాల సమావేశాలు, జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించకపోవటం వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది అంశాల్లో ఏ ఒక్క అంశంలోనేనా తేడా ఉన్నట్లు గుర్తించిన తర్వాతనే పెండింగ్‌లో పెట్టారు. కొత్త నిబంధనలతో ‘ఎవరికి మూడనుందో’నని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆగస్టు 23వ తేదీన ఒక కథనం ప్రచురించింది.
రెండోసారి పీఏసీఎస్‌ల పదవీకాలం రెన్యువల్ ప్రక్రియ పూర్తి అయ్యింది. మొత్తం 21 పీఏసీఎస్‌లకు గాను కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉన్న 13 పీఏసీఎస్‌లను రెన్యువల్ చేశారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 పీఏసీఎస్‌ల జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారులను పంపించాం. సహకారశాఖ సూచించిన కొత్త నిబంధనలతో వీటిని పెండింగ్‌లో పెట్టాం. అక్కడ నుంచి వచ్చే తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరావు, జిల్లా సహకార శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం