ఖమ్మం, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ నాయకులు, మంత్రులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరంపై అనేక అపోహలు, కాంగ్రెస్ బురద రాజకీయం, అసెంబ్లీలో చర్చ, జస్టిన్ పీసీ ఘోష్ కమిషన్ నేపథ్యంలో నిజానిజాలు ప్రజల మధ్య పెట్టాలన్న ఉద్దేశంతో కేటీఆర్, హరీశ్‌రావు సూచనలతో గత నెల 28, 29, 30వ తేదీల్లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించినట్లు తెలిపారు. ఒక మేడిగడ్డ తప్ప మిగతా అన్ని కంపోనెంట్లు చెకుచెదరకుండా ఉన్నాయన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడా కుంగలేదని కాంగ్రెస్ నాయకుల కళ్లు కుళ్లిపోయాయన్నారు. కరువు, కన్నీళ్లతో గోసపడ్డ తెలంగాణకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. యజ్ఞం చేసినట్టు చేసి కృష్ణా, గోదావరి నీటిని తెలంగాణ పొలాలకు మళ్లించాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 281 టీఎంసీల నీటి లభ్యత ఉండటం వలన్లే తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం జరిగిందన్నారు.
ప్రాణహిత, గోదావరిని ఒడిసిపట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. కానీ మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరమే కుంగిందని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దుష్పచారం చేస్తున్నారని రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరాన్ని విమర్శించడానికి మంత్రులు ఉవ్విళ్లూరుతున్నారని, అసెంబ్లీలో పోటీపడి మరీ మాట్లాడుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఇద్దరు మంత్రులు కాళేశ్వరంపైన విమర్శలు చేయడానికి హరీశ్రావుపైకి పదేపదే లేచి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లాకు వారు ఏమి చేశారని ప్రశ్నించారు.
జిల్లాను సస్యశ్యామలం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆ విషయం ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలకు తెలుసునన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు బిచ్చాల తిరుమలరావు, డోకుపర్తి సుబ్బారావు, మందడపు శంకర్రావు, పగడాల నరేందర్, కొండల్రావు, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ, బెల్లంకొండ గోపి, రాజేష్, అశోక్‌సింగ్, షారుక్ అరాఫత్ పాల్గొన్నారు.