Yogi Adityanath | జాతీయ విద్యావిధానం (National Education Policy)లో భాగమైన త్రిభాషా సూత్రం (three-language row) అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య గతకొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా స్పందించారు. యూపీలోని పాఠశాలల్లో విద్యార్థులకు తమిళం, తెలుగుతోపాటు పలు రాష్ట్రాల అధికారిక భాషలను బోధిస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాషా విధానంపై వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలల్లో విద్యార్థులకు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి భాషలను బోధిస్తున్నాం. దీని కారణంగా మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా..? దీనివల్ల రాష్ట్రంలో కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టించగలుగుతున్నాం. కొందరు స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం త్రిభాషా విధానంపై వివాదాలు సృష్టిస్తున్నారు. ఇది యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని యోగి అన్నారు.
సీఎం యోగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం (Karti Chidambaram) స్పందించారు. ఈ మేరకు ‘స్టాప్ హిందీ ఇంపోజిషన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘యూపీ ప్రభుత్వం తమ పాఠశాలల్లో తమిళంలో పాఠాలు చెప్పేందుకు ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారనే వివరాలను ఇస్తుందా..? తమిళ భాషను నేర్చుకునేందుకు ఎంత మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు..?’ అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులోని విద్యార్థులు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కార్తీ పేర్కొన్నారు.
Also Read..
Anant Ambani | జామ్‌నగర్ నుంచి ద్వారకకు.. 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న అనంత్ అంబానీ.. వీడియో
Tariffs | భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోంది.. ప్రతీకారానికి ఇదే సరైన సమయం : వైట్‌హౌస్