Vande Bharat Train | కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందేభారత్ రైలు (Vande Bharat Train) కశ్మీర్‌లోయలో తొలిసారి పరుగులుపెట్టనుంది. నెల 19న ఈ రైలు కత్రా నుంచి కశ్మీర్‌కు పరుగులు తీయనుంది. ఇప్పటికే ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు దేశవ్యాప్తంగా 50కిపైగా మార్గాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది.
ఈ క్రమంలోనే ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL)లో కశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానించే వందే భారత్ రైలును ఈనెల 19వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం వెల్లడించారు. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన చీనాబ్ రైలు వంతెనగుండా వెళ్లనుంది. ప్రస్తుతం జమ్ము రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున జమ్ము-కత్రా-శ్రీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తొలుత కత్రా నుంచి ప్రారంభం కానుంది.
మొత్తం 272 కిలోమీటర్ల మేర ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ లింక్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తైంది. రైళ్లు రియాసి జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్ము, కాత్రా గుండా వెళతాయి. సంగల్దాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే ఆరు గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం.
ఇక కశ్మీర్ లోయ వరకూ సౌకర్యవంతంగా ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందేభారత్‌ను ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. కశ్మీర్ లోయలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో బయట విపరీతమైన మంచు కురుస్తున్నా లోపల ఉన్న ప్రయాణికులు వెచ్చదనాన్ని ఆస్వాదించేలా ఈ రైలును రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా రైల్లోని నీరు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇక వందేభారత్ టికెట్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు కేవలం రూ.1,500 నుంచి రూ.2100గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రైలు మార్గమధ్యలో జమ్ము, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్ ఉండనున్నట్లు సమాచారం.
కశ్మీర్‌ను రైళ్లతో అనుసంధానించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 119 కి.మీ విస్తరించి ఉంది. వీటిలో 12.75 కి.మీ. ఉండే టీ-49.. దేశంలోనే అత్యంత పొడవైన రవాణా సొరంగం. ఈ ప్రాజెక్టులో 927 వంతెనలు ఉన్నాయి. వీటిలో చినాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది. ఈ మార్గంలో వంతెనలన్నింటి పొడవు కలిపి 13 కి.మీ.
చీనాబ్ రైలు వంతెనను (Chenab bridge) భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూ కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తైంది. ఇటీవలే ఈ వంతెనపై ట్రయల్ రన్స్ కూడా విజయవంతంగా నిర్వహించారు.
Also Read..
Anant Ambani | జామ్‌నగర్ నుంచి ద్వారకకు.. 140 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న అనంత్ అంబానీ.. వీడియో
Myanmar Earthquake: మయన్మార్‌లో భూకంప విధ్వంసం.. ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో శాటిలైట్
EPFO | ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్.. ఆటో సెటిల్మెంట్ రూ.5లక్షలకు పెంపు..!