బెంగుళూరు: మార్చి 28వ తేదీన మయన్మార్‌ను తీవ్ర భూకంపం(Myanmar Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం వల్ల సుమారు రెండు వేల మందికిపైగా మరణించారు. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్, చైనాలోనూ భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. భారీ నష్టం కలిగించిన ఆ భూకంపానికి చెందిన శాటిలైట్ ఇమేజ్‌లను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ రిలీజ్ చేసింది. ఇస్రోకు చెందిన కార్టోసాట్-3 ఉపగ్రహం ఆ చిత్రాలను తీసింది. మండాలే, సాగేయింగ్ నగరాల్లో జరిగిన విధ్వంసం ఆ చిత్రాల్లో కనిపించింది.
భూమికి 500 కిలోమీటర్ల ఎత్తు నుంచి కార్టోసాట్-3 ఆ పిక్స్‌ను తీసింది. ఇర్రవడ్డీ నదిపై ఉన్న భారీ బ్రిడ్జ్ కూలిన చిత్రాలు కార్టోశాట్ తీసిన ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మండలే యూనివర్సిటీతో పాటు ఆనంద పగోడ కూలిన చిత్రాలు ఇస్రో తీసిన ఫోటోల్లో క్లియర్‌గా ఉంది. కార్టోసాట్ ఉపగ్రహాన్ని 2019లో ఇస్రో లాంచ్ చేసింది. ఇది మూడవ జనరేషన్‌కు చెందిన అడ్వాన్స్డ్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్. అత్యాధునికమైన ఈ శాటిలైట్ తీసిన చిత్రాలను చాలా అరుదుగా ఇస్రో రిలీజ్ చేస్తుంది.
మండలే నగరంలో ఉన్న అనేక కట్టడాలకు భారీ నష్టం జరిగినట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా తెలుస్తోంది. ఆ నగరంలో ల్యాండ్‌మార్క్ ప్రదేశాలైన స్కై విల్లా, ఫయాని పగోడ, మహాముని పగోడ, ఆనంద పగోడ, మండలే యూనివర్సిటీతో పాటు అనేక ప్రాంతాల్లో పూర్తి ధ్వంసమయ్యాయని, సాగేయింగ్ సిటీలో ఉన్న మా షి ఖానా పగోడతో పాటు బౌద్ద ఆలయాలు, ఇతర బిల్డింగ్లు కూలినట్లు ఇస్రో ఓ ప్రకటనలో చెప్పింది.