న్యూఢిల్లీ, మార్చి 31: ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు కేంద్రం శుభవార్త తెలపనుంది. ఇప్పటివరకు ఆటో సెటిల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ క్లెయిమ్ (ఏఎస్ఏసీ)పై ఉన్న లక్ష రూపాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ప్రకటించే అవకాశం ఉందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఇప్పుడున్న లక్ష రూపాయలను ఐదు రెట్లు పెంచి ఐదు లక్షలకు పెంచుతూ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కార్మిక, ఉద్యోగ శాఖ కార్యదర్శి సుమితా దవ్రా ఆమోదం తెలిపారు.
గత వారం కశ్మీర్లో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో దీనిని ప్రతిపాదించారు. దీనిని తుది ఆమోదముద్ర కోసం సీబీటీకి పంపారు. ఇది అమలులోకి వస్తే ఏఎస్ఏసీ ద్వారా రూ.5 లక్షలు విత్డ్రా చేసుకునే ప్రయోజనం సుమారు 7.5 కోట్ల మంది పీఎఫ్ సభ్యులకు చేకూరుతుంది. అనారోగ్య, వైద్య చికిత్స కోసం సభ్యులు అడ్వాన్స్ కింద గరిష్ఠంగా రూ.50 వేల నగదు అత్యవసరంగా డ్రా చేసుకునే సౌకర్యాన్ని 2020 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు.