ముంబై: మరణించిన కొడుకు గ్రాట్యుటీ డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం కోసం అతడి తల్లి దారుణానికి పాల్పడింది. మరో వ్యక్తితో కలిసి కోడలిని హత్య చేసింది. ఆమె మృతదేహాన్ని ఒకచోట పడేసింది. కోడలు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు అత్తతో పాటు ఆమెకు సహకరించిన ఫ్రెండ్ను అరెస్ట్ చేశారు. (Woman Kills Daughter-In-Law) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 1న కల్యాణ్ ప్రాంతంలోని వాల్ధుని వంతెన సమీపంలో తల, ముఖంపై తీవ్ర గాయాలతో ఒక మహిళ పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె ప్రమాదవశాత్తు మరణించినట్లు పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, తన కోడలు 35 ఏళ్ల రూపాలి ఉదయం నుంచి కనిపించడం లేదని 60 ఏళ్ల అత్త లతాబాయి మరునాడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వాల్ధుని వంతెన సమీపంలో లభించిన మృతదేహాన్ని కోడలు రూపాలిగా ఆమె గుర్తించింది. దీంతో అత్త తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను గట్టిగా ప్రశ్నించగా కోడలిని హత్య చేసిన కారణాన్ని వెల్లడించింది.
మరోవైపు లతాబాయి కుమారుడు విలాస్ రైల్వే ఉద్యోగి. 2025 సెప్టెంబర్లో అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో సుమారు రూ.10 లక్షల గ్రాట్యుటీ డబ్బు కోడలు రూపాలికి అందాయి. అయితే ఆ డబ్బు తనకు ఇవ్వాలని అత్త లతాబాయి కోడలు రూపాలిని డిమాండ్ చేసింది. అలాగే కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం కోడలు దరఖాస్తు చేయడాన్ని ఆమె వ్యతిరేకింది. 15 ఏళ్ల మనవడిని కారుణ్య ప్రాతిపదికన నియమించాలని పట్టుపట్టింది.
కాగా, కోడలు రూపాలి ఒప్పుకోకపోవడంతో ఆమెను హత్య చేయాలని అత్త లతాబాయి ప్లాన్ చేసింది. డిసెంబర్ 31న రాత్రి వేళ 67 ఏళ్ల ఫ్రెండ్ జగదీష్ మహాదేవ్ మాత్రేతో కలిసి ఐరన్ రాడ్తో రూపాలి తలపై కొట్టి చంపారు. రక్తం మరకల దుస్తులను మార్చారు. ఆ తర్వాత రూపాలి మృతదేహాన్ని వంతెన సమీపంలో పడేశారు.
మరునాడు తన కోడలు అదృశ్యమైనట్లు అత్త లతాబాయి ఫిర్యాదు చేసిందని పోలీస్ అధికారి తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లు చెప్పారు. నిందితులైన లతాబాయి, మాత్రేలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Also Read:
Cross-Border Kidney Racket | రైతు వీడియో వైరల్.. సరిహద్దులు దాటిన కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
Man Beaten Up | బంగ్లాదేశీయుడిగా అనుమానించి.. బీహార్ వ్యక్తిపై దాడి
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్