ముంబై: ప్రేమను తిరస్కరించినందుకు ఒక యువతిని పొరుగు వ్యక్తి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని సీలింగ్‌కు వేలాడదీశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో హత్యగా తేలడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. (Student Killed By Neighbour) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల ప్రాచి హేమరాజ్ ఒక కాలేజీలో బీఏ చదువుతున్నది. షేర్ ట్రేడింగ్‌లో కూడా శిక్షణ పొందుతున్నది.
కాగా, జనవరి 21న ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాచి అనుమానాస్పదంగా మరణించింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తల్లి చూడగా బెడ్ రూమ్‌లో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. ప్రాచి తల్లి సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా అందరూ భావించారు.
మరోవైపు తలకు తీవ్ర గాయం కారణంగా ప్రాచి మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. దీంతో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు భావించారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. పొరుగున నివసించే 38 ఏళ్ల శేఖర్ అజబ్రావ్ ధోరే ఆ యువతిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్నారు. అతడిపై అనుమానించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, బుధవారం ప్రాచి తల్లిదండ్రులు, సోదరుడు పని కోసం బయటకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్నట్లు శేఖర్ తెలుసుకున్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి ప్రతిఘటించగా ఆమె గొంతునొక్కాడు. ఆ తర్వాత తలను గోడకేసి బాదటంతో ఆమె మరణించింది.
అయితే ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శేఖర్ ప్రయత్నించాడని పోలీస్ అధికారి తెలిపారు. ప్రాచి శరీరాన్ని చున్నీతో సీలింగ్‌కు అతడు వేలాడదీసినట్లు చెప్పారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Watch: రైల్వే క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?