లక్నో: సహజీవనం చేస్తున్న వ్యక్తిని ప్రియురాలు హత్య చేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తేలడంతో ఆ మహిళను అరెస్ట్ చేశారు. (woman kills live-in partner) ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హరిఓం సింగ్ ఒక ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శీతల్‌తో కలిసి ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. చాంద్‌పూర్‌లోని అద్దె ఇంటిలో వారిద్దరూ కలిసి నివసిస్తున్నారు.
కాగా, తనను పెళ్లి చేసుకోమని హరిఓం సింగ్‌ను శీతల్ ఒత్తిడి చేస్తున్నది. అయితే ఆమెతో వివాహాన్ని అతడి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో పెళ్లి విషయంపై ఆ జంట మధ్య వివాదం నెలకొన్నది. జనవరి 15న వారిద్దరి మధ్య గొడవ జరిగింది. శీతల్ తన పేరెంట్స్ ఇంటికి వెళ్లింది. జనవరి 18న తిరిగి వచ్చింది.
మరోవైపు ఆ రోజు రాత్రి హరిఓం సింగ్, శీతల్ కలిసి మద్యం సేవించారు. పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో హరిఓం సింగ్ బెడ్ పైకి ఎక్కాడు. సీలింగ్ నుంచి వేలాడుతున్న వైర్‌ను మెడకు బిగించుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయితే బెడ్ మీద ఉన్న హరిఓం కాళ్లను శీతల్ తన్నింది. అదుపుతప్పిన అతడు ఉరికి వేలాడాడు. ఊపిరి అందక మరణించాడు.
అయితే శీతల్ ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చింది. హరిఓం సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పొరుగువారికి చెప్పింది. సీలింగ్‌కు వేలాడుతున్న అతడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
కాగా, హరిఓం సింగ్‌ను శీతల్ హత్య చేసిందని అతడి కుటుంబం ఆరోపించింది. అతడి శరీరంపై గాయాలున్నట్లు పోస్ట్‌మార్టంలో తేలడంతో మరోసారి శవ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా శీతల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది.
హరిఓం సింగ్‌ను హత్య చేసిన శీతల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే గర్భం దాల్చగా హరిఓం సింగ్ అబార్షన్ చేయించాడని శీతల్ ఆరోపించినట్లు చెప్పారు.
Also Read:
steel plant explosion | స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. ఏడుగురు సజీవ దహనం, పలువురికి గాయాలు