లక్నో: భర్త నుంచి సులువుగా విడిపోయేందుకు ఒక మహిళ ప్లాన్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను గోవధ కేసులో రెండుసార్లు ఇరికించింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. అయితే ఆ మహిళను కోర్టు ప్రాంగణంలో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. (Woman, Lover Framed Husband) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ అలీగఢ్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. భోపాల్‌కు చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త నుంచి సులువుగా విడిపోయేందుకు ఆ మహిళ ప్లాన్ వేసింది. గోవధ కేసులో భర్తను ఇరికించేందుకు కుట్ర పన్నింది. దీని కోసం ఆమె ప్రియుడు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. ఆమె భర్త వాహనంలో గోమాంసం ఉంచాడు. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ కావడంతో మహిళ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు నెల తర్వాత మహిళ భర్త బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో రెండోసారి అతడ్ని ఇరికించేందుకు ఆ మహిళ కుట్ర పన్నింది. భర్త మొబైల్ ఫోన్ ద్వారా గోమాంసం ప్యాకెట్‌ను ఆటోలో డెలివరీకి పంపింది. అతడు పని చేసే ప్రాంతానికి అది చేరుకున్నది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే రెండో సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. అతడి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. భర్త ఇంట్లో లేనప్పుడు అతడి మొబైల్ ఫోన్ ద్వారా గో మాంసం ప్యాకెట్‌ను డెలివరీకి భార్య పంపినట్లు గ్రహించారు. ఆ మహిళపై అనుమానించి దర్యాప్తు చేశారు. భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి తప్పుడు కేసులో అతడ్ని ఇరికించేందుకు ఆమె ప్రయత్నించినట్లు తెలుసుకున్నారు.
కాగా, జనవరి 19న మహిళ ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. ఇది తెలిసి ఆ మహిళ పారిపోయింది. జనవరి 20న లక్నోలోని హైకోర్టు ప్రాంగణంలో ఆమె ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా హై కోర్టులో గందరగోళం చెలరేగింది. కోర్టు అనుమతి లేకుండా నిషేధిత ప్రాంతంలోకి పోలీసులు ప్రవేశించడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు పోలీసులపై చర్యలకు ఆదేశించారు. వారిపై కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేశారు. ఆ మహిళ, ఆమె ప్రియుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
steel plant explosion | స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. ఏడుగురు సజీవ దహనం, పలువురికి గాయాలు
Watch: రైల్వే క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?