భోపాల్: విషం కలిపిన స్వీట్ బాక్స్‌ను ఒక షాపు వద్ద వదిలేశారు. ఆ స్వీట్లు తిని ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతి చెందిన మహిళ అత్తింటి కుటుంబం ఈ కుట్రకు పాల్పడినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. (Arsenic Laced Sweets) మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 9న ఛింద్వారాలోని జున్నార్‌దేవ్ ప్రాంతంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయం సమీపంలోని షాపు వద్ద కూరగాయలు, స్వీట్ బాక్స్ ఉన్న కవర్ బ్యాగు తగిలించి ఉన్నది.
కాగా, ఆ కార్యాలయంలో పని చేసే సెక్యూరిటీ గార్డైన 50 ఏళ్ల దశ్రు యాదవ్ వంశీ ఆ కవర్ బ్యాగ్‌ను గమనించాడు. స్వీట్ బాక్స్‌లోని కొన్ని స్వీట్లు తిన్నాడు. తీవ్రమైన వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 11న మరణించాడు. పోస్ట్‌మార్టం నిర్వహించకపోవడంతో అతడి మృతికి కారణం తెలియలేదు.
మరోవైపు ఆ షాపు కుటుంబం ఆ కవర్ బ్యాగ్‌ను ఇంట్లోకి తీసుకెళ్లింది. స్వీట్ బాక్స్‌లోని స్వీట్లను తిని ఆ కుటుంబ సభ్యులు ఆసుపత్రి పాలయ్యారు. 22 ఏళ్ల ఖుష్బూ, 72 ఏళ్ల ఆమె తాత మరణించారు. ఖుష్బూ తల్లి, సోదరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
అయితే మూడు రోజుల్లో ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంపై పోలీసులు దర్యాప్తు చేశారు. స్వీట్ బాక్స్‌లో మిగిలిన స్వీట్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దూద్‌పేడా స్వీట్స్‌లో చాలా మోతాదులో విషం కలిపినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశారు.
కాగా, 2024 జనవరిలో తమను బాగా అవమానించిన కోడలు ఖుష్బూ, ఆమె కుటుంబాన్ని అంతం చేసేందుకు అత్తింటి వారు ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. మామ ఝాడు కసర్, బావ శుభమ్, ఆడపడుచు శివానీని అరెస్ట్ చేశారు. నేరానికి వినియోగించిన బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఖుష్బూ తండ్రి షాపు సమీపంలో వదిలేసిన బ్యాగ్‌లోని విషపూరిత స్వీట్లను సెక్యూరిటీ గార్డు తింటాడని నిందితులు ఊహించలేకపోయారని పోలీస్ అధికారి తెలిపారు. వారి కుట్రకు అతడు కూడా బలయ్యాడని వివరించారు. ఈ కుట్రలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Momos For Jewellery | రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చి.. మోమోలు తిన్న బాలుడు
Bird flu in Bihar | 150కు పైగా కాకులు మృతి.. బర్డ్ ఫ్లూ నిర్ధారణ, హెచ్చరిక జారీ
Watch: గుర్రంపై ఊరేగిన దళిత వరుడు.. కత్తులతో దాడికి అగ్రవర్ణాలు యత్నం