Shashi Tharoor | ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటే భారత్ మౌనంగా ఉండదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం (terrorism) పట్ల తమ సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడమే తమ లక్ష్యమన్నారు. విదేశాలకు వెళ్లే ముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. పాకిస్థాన్ ప్రాయోజిక తీవ్రవాదం, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై వివిధ దేశాలకు వివరించడానికి పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఇప్పటికే ఆయా దేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) నాయకత్వంలోని బృందం ప్రపంచదేశాలకు బయల్దేరి వెళ్లింది.
ఈ సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్పోర్ట్లో శశి థరూర్ మాట్లాడుతూ.. అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా వెళ్లే అఖిలపక్ష బృందానికి తాను నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. పాక్ సీమాంతర ఉగ్రవాదంపై దేశం తరఫున గళం విప్పేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటే భారత్ మౌనంగా ఉండదన్నారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకి తప్ప ద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్ విశ్వసిస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
Also Read..
Jharkhand | జార్ఖండ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
MBBS Student | వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి..
Southwest Monsoon | నేడు కేరళను తాకనున్న రుతుపవనాలు..