హైదరాబాద్: రైతన్నకు వాతావరణ (IMD) శాఖ తీపికబురు చెప్పింది. వ్యసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) శనివారం కేరళను (Kerala) తాకుతాయని వెల్లడించింది. అదేసమయంలో కర్ణాటకతోపాటు లక్షద్వీప్, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దీంతో కర్ణాటక, కేరళకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 48 గంటల్లో కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది. వాతావరణంలో మార్పులు, ఎల్‌నినో ప్రభావం లేకపోవడంతో రుతుపవనాలు ముందస్తుగా వస్తున్నాయని పేర్కొన్నారు.
అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఈ నెల 27న పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిం ది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములు గు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఆ యా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూ చించింది. అటు ఏపీలోనూ రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. వాయుగుండం తీవ్రవాయుగుండంగా లేదా తుఫాన్‌గా బలపడవచ్చని చెప్పారు. కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నదని తెలిపారు.
కాగా, ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సాధారణంగా ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. జూలై 8 వరకు అవి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుంది. అది అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది. ఇక గతేడాది మే 30న నైరుతి రుతుపవనాలు రాగా, 2023లో జూన్ 8న, 2022లో మే 23న దేశంలోని ప్రవేశించాయి.