రాంచీ: జార్ఖండ్‌లోని (Jharkhand) లటేహర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శనివారం తెల్లవారుజామున లటేహర్ జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని పీటీఐ కథనం వెల్లడించింది. వారిని మావోయిస్టు పార్టీ చీలిక వర్గమైన జార్ఖండ్ జన ముక్తి పరిషత్ చీఫ్ పప్పు లోహరా, ప్రభాత్ గంఝూగా గుర్తించారు. పప్పుపై రూ.10 లక్షలు, ప్రభాత్‌పై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉన్నదని తెలిపింది.
Security forces have killed two dreaded leaders of Naxal renegade outfit, Jharkhand Jan Mukti Parishad, Pappu Lohara, who was carrying a reward of Rs 10 lakh on his head, and Prabhat Ganjhu, who was carrying a reward of Rs 5 lakh in Jharkhand’s Latehar district this morning.… pic.twitter.com/N6VOsZbhws
— Press Trust of India (@PTI_News) May 24, 2025
కాల్పుల్లో మరో సభ్యుడు గాయపడ్డారని, అతడిని అరెస్టు చేశామన్నారు. ఘటనా స్థలంలో ఐఎన్ఎస్ఏఎస్ (INSAS) రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
కాగా, శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో మావోయిస్టు మృతి చెందాడు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోనే ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతోపాటు పలువురు కీలక నేతలు సైతం ఉన్నారు. నంబాల కేశవరావుపై రూ. కోటిన్నర రివార్డు ఉన్న సంగతి తెలిసిందే.