Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) అధినేత ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. లేదంటే 10 కంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన బీహార్ పవర్‌ప్లే కాన్క్లేవ్లో (Bihar Power Play Conclave) పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోగలదు..? అన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానంగా.. ‘ప్రజలు జన్ సురాజ్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తే.. 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అదే తిరస్కరిస్తే మాత్రం 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం కావొచ్చు’ అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇతర పార్టీలతో పొత్తు విషయంపై కూడా ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. తాము ద్వంద్వ రాజకీయాలు చేయమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జన్ సురాజ్ పార్టీ ఇతర ఏ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
Also Read..
LPG cylinder | వినియోగదారులకు కాస్త ఉపశమనం.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
Sabarimala: శబరిమల బంగారం చోరీ కేసులో మాజీ ఈవో అరెస్టు