Ankle Pains | శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువ సమయం పాటు చేస్తే ఎవరికైనా సరే సహజంగానే ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. అయితే కొందరికి వీటితోపాటు కాలి మడమలు కూడా నొప్పిగా ఉంటాయి. కాలి మడమల నొప్పి వచ్చేందుకు ఇంకా అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి ఉన్నా, హై హీల్స్ ధరించే మహిళల్లో, శరీరంలో క్యాల్షియం లోపించడం, వ్యాయామం అసలు చేయకపోవడం, పోషకాల లోపం వంటి కారణాల వల్ల కూడా కాలి మడమల నొప్పులు వస్తుంటాయి. అయితే ఇవి సాధారణంగా వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో నొప్పి మరీ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒక పట్టాన తగ్గదు. అలాంటప్పుడు చాలా మంది పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. కిడ్నీలపై భారం పడేలా చేస్తాయి. కనుక సహజసిద్ధమైన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వీటి వల్ల కాలి మడమల నొప్పులతోపాటు ఒళ్లు నొప్పులను సైతం సులభంగా తగ్గించుకోవచ్చు.
ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. దీని వల్ల మడమల నొప్పులు వెంటనే తగ్గుతాయి. ఆ నొప్పుల నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు అన్ని రకాల నొప్పులను తగ్గేలా చేస్తాయి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు ఒక కప్పు మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీంతో ఎంతగానో ఫలితం ఉంటుంది. అలాగే ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుని బాగా నీటిని తాగాలి. తరువాత కాళ్లను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి. అనంతరం మరో 3 నిమిషాల పాటు చల్లని నీటిలో ఉంచాలి. ఇలా 3 సార్లు చేయాలి. దీంతో మడమల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కా నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది.
ఇక నొప్పులను తగ్గించడంలో లవంగ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. మడమలపై లవంగనూనె బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. మనకు లవంగం నూనె మార్కెట్లో లభిస్తుంది. లేదా ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్లపై కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే కాలి మడమలు, ఒళ్లు నొప్పులు ఉన్నవారు పలు ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల కూడా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు. అందుకు గాను ఆలుగడ్డలు, కీరదోస, ఉసిరికాయలు, టమాటా, పచ్చి బొప్పాయి, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటి ఆహారాలు మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ ఆహారాల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి.
కాలి మడమల నొప్పులు తగ్గాలంటే ఆవ గింజలు కూడా బాగానే పనిచేస్తాయి. కొన్ని ఆవ గింజలను తీసుకుని మెత్తని పొడిలా మార్చాలి. అనంతరం ఒక బకెట్లో వేడి నీటిని తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసిన ఆవ గింజల పొడి వేసి బాగా కలపాలి. అనంతరం ఆ బకెట్లో కాళ్లను ఉంచాలి. కాళ్ల మడమలు బాగా మునిగేలా కాళ్లను బకెట్ లో పెట్టాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తున్నా కూడా కాలి మడమల నొప్పులను తగ్గించుకోవచ్చు. అలాగే ఆవ గింజల పొడికి బదులుగా రాక్ సాల్ట్ ను కూడా ఉపయోగించవచ్చు. అర బకెట్ వేడి నీటిలో రాక్ సాల్ట్ వేసి కలిపి అనంతరం ఆ నీటిలో కాళ్లను ఉంచాలి. 15 నిమిషాల పాటు కాళ్లను ఉంచి తీసేయాలి. దీని వల్ల కూడా నొప్పులు తగ్గిపోతాయి. అలాగే రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు, తేనె కలిపి తాగుతున్నా కూడా ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఇలా ఈ చిట్కాలను పాటిస్తుంటే కాలి మడమల నొప్పులను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.