పాతనమిట్ట: శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం తాపడం పేరుతో జరిగిన మోసం కేసులో అధికారులు ఇవాళ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీశ్ కుమార్‌ను అరెస్టు చేశారు. 2019లో శబరిమల ఈవోగా సుధీశ్ బాధ్యతలు నిర్వర్తించారు. తిరువనంతపురంలో క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అయ్యప్ప స్వామి వద్ద ఉన్న ద్వారపాలకుల విగ్రహాల సమాచారాన్ని దాచిపెట్టినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. బంగారు తాపడం ఉన్న ద్వారపాలకుల విగ్రహాలను.. కాపర్ షీట్లుగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించినట్లు మాజీ ఈవోపై ఆరోపణలు ఉన్నాయి.
ద్వారపాలకుల విగ్రహాల తాపడం కోసం వాటిని ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి అందజేశారు. వాస్తవానికి ఆ విగ్రహాలకు 1998లో గోల్డ్ ప్లేటింగ్ జరిగింది. అయితే మళ్లీ 2019లో ఆ విగ్రహాలను ఈవోగా ఉన్న సుధీశ్ వాటిని ఉన్నికృష్ణన్‌కు అందజేశారు. ఆ విగ్రహాలను రాగితో ప్లేటింగ్ చేసి ఉన్నట్లు చూపించి, వాటిని ఉన్న బంగారాన్ని మాజీ ఈవో తీసుకెళ్లినట్లు ఈ కేసులో ఆరోపణలు వచ్చాయి.
శబరిమల మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బీ మురారి బాబును కూడా ఈ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మాజీ ఈవో కుమార్‌ను జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.