కోల్‌కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్‌పై హై డ్రామా తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నవర్ సీవీ ఆనంద బోస్‌కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. (Bengal Governor Gets Threat Email) ఆయనను పేల్చివేస్తామని అందులో బెదిరించారు. దీంతో గవర్నర్ కార్యాలయం, అధికారిక నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గవర్నర్ బోస్‌కు వచ్చిన బెదిరింపు ఈమెయిల్ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు.
కాగా, బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి అధికార టీఎంసీ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయంపై ఈడీ అధికారులు గురువారం రైడ్ చేశారు. దీంతో టీఎంసీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. సీఎం మమతా బెనర్జీ వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆమె పార్టీకి సంబంధించిన కీలక ఫైల్‌ను తీసుకెళ్లారు. తమ రాజకీయ వ్యూహాలను కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు. తమ విధులను అడ్డుకోవడంపై కోర్టును ఈడీ ఆశ్రయించింది.
మరోవైపు ఈడీ రైడ్స్ హైడ్రామా తర్వాత గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు శుక్రవారం బెదిరింపు ఈమెయిల్ రావడంపై బీజేపీ నేత అమిత్ మాల్వియా స్పందించారు. బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ గవర్నర్ కూడా సురక్షితంగా లేరని అన్నారు. బొగ్గు అక్రమ రవాణా, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ సంస్థను రక్షించడానికి సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని, నేరారోపణ ఫైళ్లను లాక్కోవడంలో ఆమె బిజీగా ఉన్నారని మండిపడ్డారు.
Also Read:
Watch: జ్యోతిరాదిత్య కుమారుడి కాళ్లకు నమస్కరించిన.. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే
Watch: అన్న ఇంటికి నిప్పంటించేందుకు తమ్ముడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?