భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీటి కారణంగా 15 మందికిపైగా వ్యక్తులు మరణించారు. పాలనా యంత్రాంగంపై విమర్శల నేపథ్యంలో ఇండోర్ కలెక్టర్, మేయర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో దీనిపై రాజకీయ వివాదం తలెత్తింది. (Indore Collector Visit RSS Office) జనవరి 7న రాత్రి వేళ ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ, మేయర్ పుష్పమిత్ర భార్గవ, ఇండోర్‌లోని రాంబాగ్‌లో కొత్తగా ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయం ‘సుదర్శన్’ను సందర్శించారు. సుమారు గంటన్నర పాటు వారు అక్కడ ఉన్నారు.
కాగా, ఇండోర్ కలెక్టర్, మేయర్‌తో ఆర్ఎస్ఎస్ మల్వా ప్రాంత ప్రచారక్ రాజ్‌మోహన్ ఏకాంతంగా, రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇండోర్‌లోని భగీరత్‌పురాలో కలుషిత నీటి కారణంగా సంభవించిన మరణాలు, పరిపాలనలో నిర్లక్ష్యం, ఎన్నికైన సంస్థల మధ్య సమన్వయ లోపంపై ఈ సందర్భంగా వారిని మందలించినట్లు సమాచారం.
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించింది. ‘కలుషిత నీటి వల్ల అమాయక పౌరులు మరణించినప్పుడు, బాధిత కుటుంబాలు దుఃఖంలో, ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు కలెక్టర్ బాధిత కుటుంబాలతో ఉండాలా లేక ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఉండాలా?’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ మండిపడ్డారు.
అధికార పార్టీకి సంబంధించిన సంస్థ కార్యాలయంలో మూసిన తలుపుల వెనుక నుంచి అధికారులు సూచనలు తీసుకుంటున్నారా? ప్రస్తుతం పరిపాలన ప్రజలకు కాకుండా ఆర్ఎస్ఎస్కు జవాబుదారీగా ఉన్నదా?’ అని జితు పట్వారీ ప్రశ్నించారు. పరిపాలనా నిష్పాక్షికతను ఉల్లంఘించిన కలెక్టర్ శివమ్ వర్మపై సిబ్బంది, శిక్షణ శాఖ అయిన డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Also Read:
Watch: జ్యోతిరాదిత్య కుమారుడి కాళ్లకు నమస్కరించిన.. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే
Watch: అన్న ఇంటికి నిప్పంటించేందుకు తమ్ముడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Best City for Women | 2025లో మహిళలు మెచ్చిన.. దేశంలోని బెస్ట్ సిటీ ఇదే