లక్నో: ఒక జంట తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లైన రెండు నెలలకే తన కుటుంబంతో కలిసి భర్తను భార్య హత్య చేసింది. (wife kills husband) ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తేలడంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. 33 ఏళ్ల జితేంద్ర కుమార్ యాదవ్, బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ బస్ కండక్టర్‌గా జ్యోతి పనిచేస్తున్నది.
కాగా, చదువుకున్నప్పటి నుంచి 9 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది నవంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. బరేలీలోని ఇజ్జత్‌నగర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే పెళ్లైన కొన్ని వారాలకే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పూర్వీకుల ఆస్తి అమ్మి తన పేరు మీద ఇల్లు, కారు కొనాలని జితేంద్రపై జ్యోతి ఒత్తిడి చేస్తున్నది.
మరోవైపు భార్య జ్యోతి బ్యాంకు ఖాతా నుంచి జితేంద్ర రూ. 20,000 విత్‌డ్రా చేశాడు. ఆన్లైన్ జూదంలో ఆ డబ్బు పోగొట్టుకున్నాడు. జనవరి 26న ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తన తల్లిదండ్రులు, సోదరుడిని జ్యోతి అక్కడకు రప్పించింది. జితేంద్ర కాళ్లు, చేతులు వారు పట్టుకోగా జ్యోతి గొంతునొక్కి చంపింది. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని మఫ్లర్‌తో కిటికీ గ్రిల్‌కు వేలాడదీశారు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. జితేంద్ర సూసైడ్‌కు అతడి కుటుంబమే కారణమని ఆరోపించారు.
పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. జితేంద్ర మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అతడ్ని గొంతునొక్కి చంపినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. దీంతో జితేంద్ర సోదరుడి ఫిర్యాదుతో భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె నిజం ఒప్పుకోవడంతో జ్యోతి, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న జ్యోతి సోదరుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Ram’s arrow hits Ravan’s eye | రామ్‌లీలా నాటకంలో.. రావణుడి కంటికి తగిలిన రాముడి బాణం, కేసు నమోదు
Union Budget 2026 | మహిళల నేతృత్వంలో రిటైల్ ఔట్లెట్లు.. ‘షీ మార్ట్’లకు బడ్జెట్లో ప్రోత్సాహం
Union Budget 2026: దివ్యాంగులు, కృత్రిమ అవయవాల ఉత్పత్తిపై కేంద్రం దృష్టి