Meghalaya murder : మధ్యప్రదేశ్ వ్యాపారి రాజా రఘువంశీ (Raja Raghuvanshi) ని హనీమూన్ (Honeymoon) పేరుతో మేఘాలయ (Meghalaya) కు తీసుకెళ్లి కిరాయి హంతకులతో హత్య చేయించిన సోనమ్ (Sonam) ను ఆమె పుట్టింటి వాళ్లు కూడా అసహ్యించుకుంటున్నారు. ఆమె తమ కుటుంబానికి కళంకం తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తానే ఈ హత్య చేసినట్లు ఒప్పుకోవడంతోనే ఆమెతో తమకు సంబంధాలు తెగిపోయాయని సోనమ్ సోదరుడు గోవింద్ అన్నారు.
బుధవారం రాజా రఘువంశీ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిసిన గోవింద్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సోనమ్ తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాలేదని, అయితే ఇప్పటివరకు వెల్లడైన ఆధారాలను బట్టి ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ హత్యలో భాగస్వామ్యం ఉన్నట్లు అర్థమవుతోందని అన్నారు. ఆమె తప్పుచేసినట్లు తేలితే కచ్చితంగా ఉరితీయాలని కోరుకుంటున్నానని అన్నారు.
తనకు రాజా రఘువంశీ అంటే చాలా ఇష్టమని, ఇలా జరుగుతుందని తాను అస్సలూ ఊహించలేదని గోవింద్ చెప్పారు. తన చెల్లిని ఈ ఇంటికి ఇచ్చినందున ఆమె చేసిన పాపంలో నాకు పాలు ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. అందుకే రాజా కుటుంబానికి తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
కాగా రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ వివాహం మే 11న జరిగింది. మే 20న దంపతులు హనీమూన్కు మేఘాలయ వెళ్లారు. మే 23న కిరాయి హంతకులతో సోనమ్ తన భర్తను హత్య చేయించింది. ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి సోనమ్ తన పెళ్లయిన ఐదురోజులకే కుట్ర చేసింది. ఆ కుట్రలో భాగంగానే రాజాను మేఘాలయకు తీసుకొచ్చి చంపించింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.