Ankita Bhandari : మూడేళ్ల క్రితం సంచలనం రేపిన అంకితా భండారి హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని ఉత్తరాఖండ్ రాష్ట్రం కోట్ద్వార్లోని ‘ది అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు’ దోషులుగా తేల్చింది. కేసులో సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులపై నమోదైన అభియోగాలు నిజమేననే నిర్ధారణకు వచ్చి తాజా తీర్పు వెలువరించింది. రిషికేశ్‌లోని ఓ రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేసే అంకితా భండారి 2022 సెప్టెంబర్‌లో దారుణ హత్యకు గురైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరి జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువతి రిషికేశ్‌లోని వనంత్ర రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేసేంది. సెప్టెంబర్ 18న అమె హత్యకు గురైంది. అయితే సెప్టెంబర్ 24న చిల్లా కెనాల్లో మృతదేహం లభ్యం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వనంత్ర రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య, అతని సన్నిహితులు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను నిందితులుగా గుర్తించారు.
లైంగిక వేదింపుల విషయం బయటపెడుతానని హెచ్చరించడంతో ముగ్గురు నిందితులు కలిసి బాధితురాలిని చిల్లా కెనాల్ తోసేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించి 500 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 2023 జనవరి 30 నుంచి పలు దఫాలుగా ఈ కేసు విచారణ జరిపిన కోర్టు.. నిందితులను దోషులుగా తేల్చింది. అయితే ఈ కేసులో శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.