లక్నో: హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన జంట అదృశ్యమైంది. (UP Couple On Honeymoon Missing) వారు ప్రయాణించిన కారు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది. నీటి ప్రవాహంలో ఎస్యూవీ కొట్టుకుపోయింది. గల్లంతైన ఆ జంటతోపాటు మరికొందరు వ్యక్తుల కోసం 15 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్‌కు మే 5న వివాహం జరిగింది. మే 24న హనీమూన్ కోసం ఈ జంటతో పాటు కుటుంబ సభ్యులు సిక్కిం బయలుదేరారు.
కాగా, మే 29న సిక్కింలోని మంగన్ జిల్లాలో వారితోపాటు ఒడిశాకు చెందిన పర్యాటకులు ప్రయాణించిన ఎస్యూవీ రోడ్డు నుంచి జారిపోయింది. వెయ్యి అడుగుల ఎత్తు నుంచి తీస్తా నదిలో పడింది. అందులో పది మంది ప్రయాణించారు. సిక్కింలోని సింఘిక్కు చెందిన డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించాడు. ఒడిశాకు చెందిన ఇద్దరు పర్యాటకులు గాయాలతో బయటపడ్డారు.
మరోవైపు గల్లంతైన జంటతో సహా ఎనిమిది మంది పర్యాటకుల కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అటవీ, పర్యాటక, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ సిక్కిం, పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నదని అధికారులు తెలిపారు.
కాగా, కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ ప్రమాద స్థలానికి చేరుకున్నాడు. హనీమూన్ కోసం సిక్కిం వెళ్లి అదృశ్యమైన కొడుకు, కోడలు కోసం గత 15 రోజులుగా అక్కడ ఉన్నాడు. వారి గురించి తెలిసే వరకు తాను తిరిగి వెళ్లబోనని ఆయన చెప్పాడు. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం కోసం సిక్కిం సీఎంను కోరాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన విజ్ఞప్తి చేశాడు.
Also Read: