రుద్రంపూర్, మార్చి 07 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్‌లో శనివారం బొగ్గు రవాణాను ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వీకే కోల్ మైన్‌కు సంబంధించిన సమస్యలపై వి.కే.సి.ఎం యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు నిర్వహించి కొన్ని విభాగాల్లో ఉద్యోగులు అధికంగా ఉన్నారని పేర్కొంటున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో బొగ్గు తవ్వకాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా, సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు తీయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రంలో ప్రధానంగా వారు ఐదు డిమాండ్లను ప్రస్తావించారు.
వీకే కోల్ మైన్‌లో ఉన్న బొగ్గును పూర్తిగా సింగరేణి ఉద్యోగులతోనే తవ్వించాలని, ప్రైవేట్ సంస్థలకు అప్పగించకూడదని కోరారు. అలాగే జీకే ఓసీ మూతపడిన నేపథ్యంలో డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు పంపిన వివిధ హోదాల ఉద్యోగులను మళ్లీ వీకే సీఎమ్ కోల్ మైన్‌కు తీసుకురావాలన్నారు. అదేవిధంగా వీకే కోల్ మైన్‌ను పూర్తిగా సింగరేణి కంపెనీ యంత్రాలతోనే నడపాలని కోరారు. ఇంకా పీవీకే–5 మైన్ కూడా త్వరలో మూతపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న సుమారు 900 మంది ఉద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. వినతి పత్రాన్ని అందజేసిన వారిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ ఎం.ఆర్.కే ప్రసాద్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ గోపు కుమారస్వామి, ఐఎఫ్టీయూ ఫిట్ సెక్రటరీ కాపు కృష్ణ, విప్లవ రెడ్డి, కాగితపు విజయ్ కుమార్, హిరాలాల్ తదితర యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.