అహ్మదాబాద్: టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లో జరగనున్నది. దీని కోసం కివీస్, భారత్ జట్లు ప్రిపేరయ్యాయి. అయితే ఇవాళ అహ్మద్‌బాద్ పిచ్‌ను పరిశీలించిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్(Mitchell Santner) మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ స్టేడియం హై స్కోరింగ్ మ్యాచ్‌కు వేదికయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పాడు. భారతీయ బౌలింగ్ యూనిట్‌ను సాంట్నర్ ప్రశసించాడు.మరీ ముఖ్యంగా స్పీడ్ బౌలర్ బుమ్రాపై ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. మోదీ స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కనిపిస్తున్నట్లు చెప్పాడు. ఫ్లాట్ పిచ్ కావడం వల్ల హై స్కోరింగ్ అయ్యే ఛాన్సు ఉన్నట్లు వెల్లడించాడు.
బుమ్రా ఒక్కడే సమస్య కాదు అని, భారత బౌలింగ్ యూనిట్ బలంగా ఉన్నట్లు చెప్పాడు. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో బుమ్రా వేసిన బౌలింగ్ ప్రత్యేకమైందని సాంట్నర్ తెలిపాడు. బుమ్రా గురించి ప్రతి ఒక్కరు చర్చిస్తారని, అతను బౌలింగ్ వేస్తున్న తీరు హర్షణీయమన్నాడు. అతని బౌలింగ్‌లో పరుగులు రాబట్టేందుకు ఇంగ్లండ్ ఇబ్బందిపడిందని, మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పింది బుమ్రానే అని సాంట్నర్ తెలిపాడు. భారత జట్టులో ప్రతి ఒక్కరు ఏదో ఓ దశలో రాణిస్తున్నారని, బ్యాట్‌తో అయినా లేక బంతి అయినా మేటి ప్రదర్శిస్తున్నారని, టీమ్‌గా ఆ జట్టు రాణిస్తున్నట్లు కివీస్ కెప్టెన్ చెప్పాడు.