Amit Shah | ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై లోక్‌సభలో (Lok Sabha) రెండో రోజు చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ సందర్భంగా ఇవాళ షా మాట్లాడారు. పహల్గాం ప్రతీకారాన్ని ధృవీకరించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుబెట్టినట్లు వెల్లడించారు.
‘పహల్గాంలో పర్యాటకులను హత్య చేశారు. టూరిస్టులను ఉగ్రవాదులు అతికిరాతకంగా హత్య చేశారు. కుటుంబ సభ్యలు ముందే కాల్చి చంపారు. మంతం, పేరు అడిగి మరీ చంపడం దారుణం. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని హతమార్చం. ఈనెల 22న శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఉగ్రవాదుల కదలికలను గుర్తించాం. ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రదాడి జరిగిన రోజునే జమ్ము భద్రతపై సమీక్షించాం. ఉగ్రవాదులను ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా అరెస్ట్ చేశాం. ఉగ్రశిబిరాలను మట్టిలో కలిపేశాం. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ము పోలీసులకు అభినందనలు’ అని అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదుల్ని హతమార్చాం అంటే విపక్షాలు సంతోషిస్తాయనుకున్నానని, కానీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారంటూ షా వ్యాఖ్యానించారు.
నెల నుంచి జల్లెడ పట్టి..
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలో ఉన్న హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో గడిచిన నెలరోజులుగా ఆ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. లష్కరే, జైషే ఉగ్రవాదుల కదలికల కోసం గడిచిన 14 రోజులుగా మరింత ముమ్మరంగా నిఘాను పెంచాయి. ఈ క్రమంలో దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో రెండు రోజుల కిందట అనుమానస్పద కమ్యూనికేషన్లను భారత సైన్యం పసిగట్టింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు.. మెరుపు వేగంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హామ్జా కూడా హతమైనట్టు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులేనని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు పాలుపంచుకొన్నట్టు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ అనంతరం జరిపిన సోదాల్లో 17 గ్రెనెడ్లు, ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకొన్నాయి.
Also Read..
Parliament | ఉభయ సభలు ప్రారంభం.. సిందూర్‌పై లోక్‌సభలో కొనసాగుతున్న చర్చ
Nimisha Priya | నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం.. విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం