Budget 2025 | పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై పలు రంగాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో ఒకటి రియల్ ఎస్టేట్ రంగం. వాస్తవంగా బడ్జెట్ అంటే.. అన్ని వర్గాలు తమకు ఏదైనా శుభవార్త చెబుతారేమోనని ఆశపడుతుంటాయి. ఈ సారి ప్రభుత్వం, బడ్జెట్ వైపు రియల్ ఎస్టేట్ రంగం సైతం భారీగానే ఆశలు పెట్టుకున్నది. గత ఏడాది రియల్ ఎస్టేట్ రంగం తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నది.
ఈ క్రమంలో బడ్జెట్లో ఏమైనా ఊరట కలుగుతుందేమోనని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేట్లు పెరగడంతో పాటు ఇండ్లు కొనుగోలు చేస్తే వర్తించే పన్ను మినహాయింపులు పరిమితంగానే ఉన్నాయి. భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో వేతన జీవుల ఆదాయం ఎక్కువగా ఇంటి అవసరాలకే సరిపోతుంది. దాంతో సొంతింటి కల చివరకు.. కలగానే మిగిలిపోతున్నది. రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ ఉంటేనే.. మిగతా రంగాల వ్యాపారాల్లోనూ పెరుగుదల ఉంటుందని.. లేదంటే తగ్గిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తమకు ప్రయోజనాలు కల్పిస్తుందని గృహనిర్మాణదారులతో పాటు కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. సిమెంట్, స్టీల్, ఐరన్‌తో పాటు నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రికి సంబంధించిన జీఎస్టీని తగ్గించడంతో పాటు గ్రీన్ బిల్డింగ్స్‌కు ప్రోత్సాహకాలు అందించాలని కోరుకుంటున్నారు. ఇక గృహ కొనుగోలుదారులు మాత్రం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 (B) కింద వడ్డీరేట్లపై ఇన్‌కం ట్యాక్స్ పన్నులో మినహాయింపు పరిధిని రూ.5లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం గృహ రుణ వడ్డీ రేట్లపై ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.2 లక్షలుగా ఉన్నది.
నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపుతో పాటు వడ్డీ రేట్లపై ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పరిమితి పెంచితే రియల్ ఎస్టేట్ రంగం భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గృహ రుణ వడ్డీ రేట్లపై ఆదాయపు పన్ను రూ.2లక్షలు బాగా తక్కువ అని పేర్కొంటున్నారు. పన్ను మినహాయింపును పరిమితి రూ.5లక్షలకు పెంచితే ఇండ్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. దాంతో రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో పాటు ఆదాయపు పన్ను రూపంలోనూ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఈ సారి బడ్జెట్లో ఏమైనా నిర్మాణ రంగానికి కేంద్రం ఊరట కల్పిస్తుందా? లేదా? వేచి చూడాల్సిందే.
Income Tax | ఈ బడ్జెట్‌పైనే వేతనజీవుల ఆశలు.. ఆదాయపు పన్ను విధానంలో ఈ మార్పులు వచ్చేనా!
వరుస పతనాలకు బ్రేక్.. సెన్సెక్స్ 535, నిఫ్టీ 128 పాయింట్ల లాభం