ముంబై, జనవరి 28 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్ పడింది. బ్యాంకింగ్, వడ్డీరేటుకు సంబంధించిన రంగాల షేర్లకు లభించిన మద్దతుతో సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. ఆర్థిక వ్యవస్థలోకి భారీగా నిధులను చొప్పించడానికి రిజర్వుబ్యాంక్ సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలు మదుపరులను కొనుగోళ్లవైపు నడిపించాయి. దీంతో ఇంట్రాడే వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 535.24 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 75,901.41 వద్ద ముగియగా, 128.10 పాయింట్లు అందుకొని నిఫ్టీ 22,957.25 వద్ద స్థిరపడింది.
గడిచిన రెండు రోజులుగా భారీగా పతనమైన సూచీలకు రిలీఫ్ ర్యాలీ దొరికిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. సూచీల్లో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటర్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా, జొమాటో, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, సన్‌ఫార్మా, లార్సెన్ అండ్ టుబ్రో, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, నెస్లె, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్ సూచీ అత్యధికంగా 1.49 శాతం లాభపడగా, ఆర్థిక సేవలు 1.45 శాతం, రియల్టీ 1.27 శాతం, ఆటో 1.16 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు, హెల్త్‌కేర్, ఇండస్ట్రీయల్స్, యుటిలిటీ, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఐటీ, ఐటీ రంగ షేర్లు పతనం చెందాయి.