Tihar Jail | బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణం ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా (Vijay Mallya), నీరవ్ మోదీ (Nirav Modi), సంజయ్ భండారీ (Sanjay Bhandari)లను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూకే అధికారులు (UK Team) ఢిల్లీలోని తీహార్ జైలు (Tihar Jail)ను సందర్శించారు. బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ బృందం (Britain Crown Prosecution Service) ఈ ఏడాది జులైలో తీహార్ జైలును సందర్శించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జైల్లో భద్రత, ఖైదీలకు అందించే సౌకర్యాలను పరిశీలించినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేసి విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. 2016లో ఆయన లండన్ పారిపోయాడు. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. అతను కూడా విదేశాలకు పారిపోయాడు. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో నీరవ్ మోదీ తమదేశంలోనే నివసిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం 2018 డిసెంబర్లో ప్రకటించింది. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేయగా.. 2019లో నీరవ్ మోదీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఈ పరిణామాలతో నీరవ్ అక్కడి కోర్టులో పిటిషన్ వేయగా.. దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. వీరితోపాటు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్ను మధ్యవర్తి సంజయ్ భండారీని కూడా రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది. గతేడాది బ్రెజిల్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అక్కడ బ్రిటన్ ప్రధానితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా (Vijay Mallya), నీరవ్ మోదీ (Nirav Modi)లను భారత్‌కు అప్పగించాలని ఆయన్ని మోదీ కోరారు.
Also Read..
Red Fort | ఎర్రకోటలో భారీ చోరీ.. వజ్రాల కలశం అపహరణ
Upendra Dwivedi | పాక్‌తో యుద్ధం మూడు రోజుల్లో ముగియలేదు : ఆర్మీ చీఫ్ జనరల్
PM Modi | ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయం : ప్రధాని మోదీ