Ram Kadam : ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) వర్గం శివసేన (Shiv Sena) పార్టీ నేతలైన ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్ (Sanjay Raut) తదితరులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, వాళ్లను తక్షణమే మెంటల్ ఆస్పత్రి (Mental Hospital) లో చేర్పించాలని బీజేపీ (BJP) మండిపడింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులు బీజేపీలో చేరినా చేరవచ్చునని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో బీజేపీ నేత రామ్ కదమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్ధవ్ థాకరేతోపాటు ఆయన పార్టీలోని కొందరు నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, వాళ్లు మెంటల్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని రామ్ కదమ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నేత సంజయ్ నిరుపమ్ కూడా రౌత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన నేతలు ఎన్డీఏ కూటమిలో చేరాలని ప్రయత్నిస్తున్నారని, కానీ అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రౌత్ వ్యాఖ్యలు భారత జవాన్లకు అవమానకరమని అన్నారు.