Death Sentence | యూఏఈ (UAE)లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష (Death Sentence) పడింది. వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలడంతో ఇద్దరు వ్యక్తులకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) గురువారం తెలిపింది. నిందితులు కేరళకు (Kerala natives) చెందిన మహమ్మద్ రినాష్ అరంగిలోట్టు, మురళీధరన్ పెరుమ్తట్ట వలప్పిల్‌గా పేర్కొంది.
ఓ యూఏఈ వాసిని హత్య చేసిన కేసులో మహమ్మద్ రినాష్ దోషిగా తేలాడు. ఇక మురళీధరన్‌కు ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో శిక్ష పడింది. ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ యూఏఈలోని అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ కాసేషన్ తీర్పు వెలువరించింది. శిక్ష అమలుపై యూఏఈ అధికారులు ఫిబ్రవరి 28న భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. వీరిద్దరికీ అవసరమైన దౌత్య, న్యాయ సాయం అందజేసినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. మరణశిక్ష సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్లు పేర్కొంది. రాయబార కార్యాలయం బాధిత కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. అంత్యక్రియల్లో వారు పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
కాగా, మూడు రోజుల క్రితం యూఏఈ జైలులో భారతీయ మహిళా షెహజాది ఖాన్‌కు ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే. ఓ హత్య కేసులో ఆమెకు ఈ శిక్ష విధించారు. దాదాపు ఏడాది పాటు ఆమె న్యాయపోరాటం చేసినా ఫలితం లభించలేదు. ఫిబ్రవరి 15వ తేదీనే ఆమెను ఉరితీసినా.. ఆ సమాచారం ఆలస్యంగా వారి కుటుంబ సభ్యులకు చేరింది.
Also Read..
Tejasvi Surya | ప్రముఖ గాయనితో ఎంపీ తేజస్వి సూర్య వివాహం.. ఫొటోలు వైరల్
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?