Viral news : పొరుగింటి వ్యక్తి తమ పెంపుడు కుక్కను తిట్టాడని ఆ కుక్క యజమానులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి అతడి ముక్కు కోశారు. ఆపై అక్కడి నుంచి పారిపోయారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని నోయిడా జిల్లా (Noida district) లో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడా జిల్లాలోని నాట్ కీ మడైయా గ్రామంలో దేవేంద్ర, సతీశ్ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇటీవల సతీశ్‌కు చెందిన పెంపుడు కుక్క మొరగడంతో పొరుగింటి వ్యక్తి దేవేంద్ర దాన్ని తిట్టాడు. దాంతో సతీశ్, అతడి సోదరుడు అమిత్, కుమారుడు తుషార్.. దేవేంద్ర ఇంటిపై పడి అతడిని, అతడి భార్య మున్నీ దేవిని తీవ్రంగా కొట్టారు.
అంతటితో ఆగక పదునైన కత్తితో దేవేంద్ర ముక్కు కోశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు దేవేంద్ర తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.