అలంపూర్ చౌరస్తా, ఫిబ్రవరి 19 : అతివేగంగా వచ్చిన ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు (ఏపీ 39 జెడ్ 0557) బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని మియాపూర్ నుంచి 19 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే జడ్చర్ల సమీపంలోని దివిటిపల్లి వద్ద కంటైనర్ బోల్తా పడడంతో దాదాపు 2 గంటల పాటు బస్సు ట్రాఫిక్‌లో ఉండిపోయింది. రాత్రి 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరగా కొత్తకోటకు రాగానే డ్రైవర్ నాగరాజు డ్యూటీ దిగిపోగా.. మరో డ్రైవర్ జయరాములు డ్యూటీ ఎక్కి బస్సు ముందుకు నడిపించాడు.
తర్వాత తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులోకి రాగానే డ్రైవర్ జయరాముడు నిద్రమత్తులోకి జారుకోవడంతో అనుమానంతో బస్సులో ప్రయాణికుడు సుబ్బారాముడికి అనుమానం వచ్చి డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు వెళ్తుండగా.. అప్పటికే కంట్రోల్ తప్పడంతో హైవే-44 పక్కకు వెళ్లి బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఉలిక్కిపడి నిద్రలేచి ఆర్తనాదాలు పెట్టారు. 9 మంది సుబ్బారాయుడు, అరుణ, మోహన్‌రెడ్డి, రామేశ్వరమ్మ, రంగన్న, శివ, వీరేశ్, గౌస్, స్నేహలత తీవ్రంగా గాయపడ్డారు.
మరో 10 మందికి కుమార్, ప్రదీప్, రామాంజనేయులు, రమేశ్‌కుమార్, వెంకట్మ్రణరెడ్డి, భార్గవరామ్, చరితతోపాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మూడు అంబులెన్స్‌లలో కర్నూల్ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్సై శేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం అనంతపురం జిల్లా ఏపీఆర్టీసీ డీఎం మురళిధర్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదతీవ్రతను పరిశీలించి కర్నూల్లో చికిత్స పొందుతున్న ప్రయాణికులను పరామర్శించారు.
తల్లి చూసేందుకు వచ్చి.. చేయిని కోల్పోయి..
అనంతపురానికి చెందిన స్నేహలత 23ఏళ్ల అమ్మాయి. హైదరాబాద్‌లోని ఒక సాఫ్టేవేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. అయితే తన తల్లి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ రావడంతో బుధవారం రాత్రి బస్సులో అనంతపురం బయలుదేరింది. అయితే ఈ ప్రమాదంలో స్నేహలతకు తీవ్రగాయాలయ్యాయి. తలకు తీవ్రగాయం కాగా, ఎడమచేయి పూర్తిగా కోల్పోయింది. దీంతో ఇప్పుడిప్పుడే నా జీవితం మొదలైందని నా ఉద్యోగం రెండు చేతులతో చేసేపని ఒక చెయ్యి లేకపోతే ఉద్యోగం ఎలా చేస్తానని నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని అంబులెన్స్‌లో కన్నీరుపెట్టుకున్నది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికుడు సుబ్బారాయుడు విలేకరికి తెలిపాడు.