Gold loan : మన దేశంలో బంగారు ఆభరణాల (Gold ornaments) కు ఎంతో క్రేజ్ ఉంది. అందుకే ధర ఎక్కువైనా బంగారం కొనుగోళ్లు భారీగా సాగుతున్నాయి. అయితే బంగారం ఆభరణాలుగా మాత్రమే కాకుండా డబ్బు అత్యవసరమైనప్పుడు తాకట్టుకు కూడా ఉపయోగపడుతుంది. అయితే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం (Loan) తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని, లేదంటే నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బంగారం విలువ ఆధారంగా దానిపై రుణం ఇస్తారు. దాన్నే లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తి అంటారు. అంటే బంగారం మొత్తం విలువలో ఎంత శాతం రుణంగా ఇస్తారో అదే లోన్ టూ వాల్యూ అన్నమాట. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ LTV నిష్పత్తి గరిష్టంగా 75 శాతం వరకు ఉండవచ్చు. అంటే మీ బంగారం విలువ రూ.లక్ష అయితే, మీరు గరిష్టంగా రూ.75 వేల వరకు రుణం పొందవచ్చు. బంగారం విలువను దాని స్వచ్ఛత, బరువు ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు గత 30 రోజుల్లో ఇండియా బులియన్ అండ్ జ్యుయెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసిన సగటు రేటు ఆధారంగా బంగారం ధరను నిర్ణయిస్తాయి.
బంగారంపై రుణం తీసుకునే ముందు, వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, చెల్లింపు నిబంధనలు, ప్రాసెసింగ్ ఫీజులు తదితర వివరాలను పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఏదైనా ఆకర్షణీయమైన ఆఫర్‌కు ఆకర్షితులయ్యే ముందు, దానిలోని ప్రతి లైన్‌ను జాగ్రత్తగా చదవాలి. కొన్నిసార్లు కొన్ని పథకాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ వాటికి హైడింగ్ చార్జెస్ ఉంటాయి. కొన్నిసార్లు వడ్డీ పెరుగుతుంది. ఒక రోజు ఆలస్యమైతే భారీ జరిమానాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా విశ్వసనీయ రుణదాత నుంచి రుణం తీసుకోవాలి. తక్కువ వడ్డీ రేట్లకు ఆకర్షితులై మోసపోవద్దు. చౌకగా కనిపించేది ఎల్లప్పుడూ చౌకగా ఉండదు.
బంగారం ధరలు నిత్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ధరల్లో కొద్దిగా తేడా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ధరల్లో భారీగా మార్పు జరిగితే మాత్రం మీరు తీసుకున్న లోన్‌పై ప్రభావం పడుతుంది. బంగారం ధర అధికంగా పెరిగితే మీరు అదే బంగారంపై మరి కొంత అదనంగా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగారం ధర అధికంగా తగ్గితే మీరు తీసుకున్న లోన్ మొత్తంలో అసలు కొంత చెల్లించాల్సి వస్తుంది.