న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్పత్కు చెందిన 28 ఏళ్ల మహిళ వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య(Woman Suicide) చేసుకున్నది. అయితే సూసైడ్ నోట్‌ను ఆమె తన శరీరంపై రాసుకున్నది. మనీషా అనే మహిళ పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాళ్లు, చేతులు, కడుపుపై పెన్‌తో ఆమె సూసైడ్ నోట్ రాసింది. భర్త కుందన్, అతని ఫ్యామిలీ పెట్టిన వేధింపులు తట్టుకోలేక తనవు చాలిస్తున్నట్లు ఆమె తన నోట్లో పేర్కొన్నది. హిందీ భాషలో ఆమె ఆ నోట్ రాసింది. భర్త కుందన్, ఫ్యామిలీ తన చావుకు కారణమని చెప్పింది.
తన వేదనకు చెందిన ఓ వీడియోను కూడా మనీషా రిలీజ్ చేసింది. పోలీసులు ఆ క్లిప్‌ను సీజ్ చేశారు. భర్త కుందన్, అతని తల్లి, సోదరుడు, తండ్రి వేధిస్తున్నట్లు దాంట్లో చెప్పిందామె. అదనపు కట్నం కింద కారు, డబ్బు కావాలని భర్త ఫ్యామిలీ అడుగుతున్నట్లు ఆమె పేర్కొన్నది. పెళ్లి కోసం 20 లక్షలు ఖర్చు చేశారని, బుల్లెట్ మోటర్‌సైకిల్‌ను కట్నం కింద ఇచ్చినట్లు ఆమె సూసైడ్ లేఖలో రాసింది. అప్పుడప్పుడు భర్త ఫ్యామిలీ కొట్టేవారని, అబార్షన్ చేసుకునేలా చేసినట్లు చెప్పిందామె. కట్నం ఇవ్వలేదని తనకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపాలని చూసినట్లు పేర్కొన్నది.
2023లో మనీషా పెళ్లి చేసుకున్నది. నోయిడాకు చెందిన కుందన్‌ను ఆమె పెళ్లాడింది. అదనపు కట్నం కావాలని మరుదులు వేధించినట్లు ఆరోపించింది.