న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను సీఎం రేవంత్‌రెడ్డి తు.చ తప్పకుండా తెలంగాణలో అమలుచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆంధ్రా పార్టీల కూటమిని ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా పెట్టుకొన్నారని, తెలంగాణలో టీడీపీ పునరుజ్జీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్‌ను చీల్చి బీజేపీతో పొత్తు పెట్టుకునేలా ఎత్తులు వేస్తున్నారని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో గురువారం రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ దూత మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పార్టీ అధిష్ఠానం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రులు దుమ్మెత్తిపోసినట్టు సమాచారం.
మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో నదీ తీరంలో సేకరించిన భూమిని ‘స్పెషల్ ఎకనమిక్ టూరిజం జోన్’గా మార్చి, చంద్రబాబు సూచించిన ఓ మల్టీనేషన్ కంపెనీకి మానిటైజేషన్ పద్ధతిలో 99 ఏండ్లకు లీజుకు ఇవ్వబోతున్నట్టు సీనియర్ మంత్రులు రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.58 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని భరించేందుకు సిద్ధమైందని మంత్రులు ఆధారాలు సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాష్ట్రంలో బలంగా ఉన్న రెండు పత్రికలు, నాలుగు చానళ్లను అడ్డం పెట్టుకొని తమ వ్యక్తిత్వంపై దాడి చేయిస్తున్నారని, తమను అవినీతిపరులుగా చిత్రీకరిస్తున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని డుప్లికేట్ ఆధారాలు సృష్టించి అధిష్ఠానానికి పంపించి, గుండుగుత్తగా అందర్నీ మోసం చేస్తున్నారని వివరించినట్టు చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి వేస్తున్న ప్రతి అడుగూ తెలంగాణలో టీడీపీకి పునరుజ్జీవం పోసే దిశగానే ఉంటున్నదని, ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ పేర్ల కంటే ఎక్కువగా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారని నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారిగా అసలు కాంగ్రెస్ నేతల మొర ఆలకించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తొలుత రాష్ట్ర నేతలందరితో ఉమ్మడిగా సమావేశమయ్యారని, తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క తదితర నేతల విజ్ఞప్తి మేరకు ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ సందర్భంగా మేడారం జాతర టెండర్లలో మంత్రుల మధ్య విభేదాలు, అవినీతి ఆరోపణలు, నైని బొగ్గు గనుల కుంభకోణంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరికొందరు మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం, సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం రెండేండ్ల పరిపాలన ప్రోగ్రెస్ రిపోర్టు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధిష్ఠానం సీరియస్‌గా చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ నేతలు మీడియా ముందు ‘అంతా బాగా జరిగింది’ అని చెప్తున్నా, సమావేశం మాత్రం వాడీవేడిగానే సాగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
మంత్రులు భట్టి విక్రమార్క, కొండా సురేఖ, పొంగులేటితో భేటీ సందర్భంగా వారి మీద వచ్చిన ఆరోపణలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. నైని బొగ్గు గనుల కుంభకోణం, వ్యాపారవేత్త కణతపై తుపాకీ పెట్టిన ఘటన, కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడం తదితర అంశాల మీదనే రాహుల్ గాంధీ సమాచారం అడిగినట్టు తెలిసింది. దీంతో మంత్రులు తమవైపు నుంచి వివరణ ఇచ్చుకున్న తర్వాత రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసినట్టు సమాచారం. తమ శాఖల్లో ముఖ్యమంత్రి జోక్యం మితిమీరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారట.
తన అనుకూల బ్యూరోక్రాట్లను తమ శాఖల్లో హెచ్వోడీలుగా నియమించారని, తమకు కనీస సమాచారం లేకుండా హెచ్‌వోడీలతో దిగువ స్థాయి కీలక అధికారులకు పోస్టింగులు ఇచ్చారని, తమ ప్రమేయం లేకుండా ఆయా శాఖల్లో రోజువారీ నివేదికలను తెప్పించుకుంటున్నారని మంత్రులు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ప్రతి శాఖలో షాడో మంత్రులను పెట్టి సమాంతర వ్యవస్థ నడిపిస్తున్నారని, అధికారులు కూడా షాడో మంత్రి వర్గానికే సహకరిస్తున్నారని, తమను డమ్మీలుగా చూస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తాము ఫైల్‌ను రిజెక్ట్ చేసినా.. నేరుగా సీఎం వద్దకు పంపుతున్నారని చెప్పినట్టు సమాచారం.
నైని బొగ్గు గనుల కుంభకోణం పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ఒక పత్రిక యజమానితో కలిసి తనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టినట్టు డిప్యూటీ సీఎం భట్టి, రాహుల్‌గాంధీకి వివరించినట్టు తెలిసింది. తనను రాజకీయంగా బదనాం చేసేందుకే నైని గనుల కాంట్రాక్టును తెరపైకి తెచ్చారని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంట్రాక్టు కన్ఫర్మేషన్ కాకముందే తాను ఎలా అవినీతికి పాల్పడుతానని భట్టి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు కుంభకోణం ప్రజల దృష్టికి రాకుండా ఉండేందుకే బొగ్గు గనుల కుంభకోణాన్ని సృష్టించి మీడియాకు వదిలారని రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసినట్టు చర్చించుకుంటున్నారు.
మూడు రోజుల కిందటే నదీ తీరం భూముల స్వాధీనం కోసం నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ భూములను స్పెషల్ ఎకానమిక్ టూరిజం జోన్లుగా (ఎస్ఈటీజెడ్) మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారట. చంద్రబాబు అనుకూల కంపెనీకి ఈ భూములను 99 ఏండ్ల లీజుకు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారట. ఈ అంశాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధిష్ఠానానికి వివరించినట్టు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను కూడా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవాలని మంత్రులు సూచించినట్టు తెలిసింది. అయితే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీపరంగా హామీ ఇచ్చిన మాట నిజమేనని రాహుల్‌గాంధీ అన్నట్టు సమాచారం. దానికి భట్టి విక్రమార్క బదులిస్తూ ఆ సమయంలో తాను కూడా ఉన్నానని చెప్పినట్టు సమాచారం.
ఏఐసీసీ దూత మీనాక్షీనటరాజన్, మంత్రి ఉత్తమ్ నుంచి మాత్రం అధిష్ఠానం జడ్జిమెంట్ తరహా సమాచారమే అడిగినట్టు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితిపై ఫోకస్ చేసి అడిగినట్టు సమాచారం. ఏపీ మంత్రి లోకేశ్ పేషీ చెప్తే తెలంగాణలో కాంట్రాక్టు పనులు ఇస్తున్నట్టు ఫిర్యాదు చేశారట. అసలు కాంగ్రెస్ నేతలను రాజకీయంగా బలహీనపరిచి, అవసరమైన సమయంలో తన వెంట కలిసి వచ్చే వలసవాదులకే సీఎం ప్రాముఖ్యత ఇస్తున్నారని కాంట్రాక్టులు, పదవులు వారికే కట్టబెడుతున్నారని వివరించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తికి ఒక వేదిక సిద్ధమవుతున్నదని, దానికి ప్రత్యక్షంగా రేవంత్‌రెడ్డే సహకరిస్తున్నారని ఆరోపించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమర్జెన్సీలో కాంగ్రెస్‌ను రెండుగా చీల్చి ఆంధ్రా కూటమితో కలిసే ప్రయత్నం జరుగుతున్నట్టు తన వద్ద సమాచారం ఉన్నదని, అధిష్ఠానమే దీనిని నిర్ధారించుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా మీనాక్షి సమాచారం ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే కారణం ముందుపెట్టి టీడీపీని ప్రమోట్ చేసినది వాస్తమేనని ఆమె వివరించినట్టు తెలిసింది.