హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): అసలు కాంగ్రెస్ నేతలకు ముఖ్యనేత మరోసారి మొండిచేయి చూపబోతున్నారా? రాజ్యసభ ఎన్నికల్లో వలస కాంగ్రెస్ నేతలకు పట్టంకట్టి, అసలు కాంగ్రెస్ నేతల ఆశలను అడియాసలు చేయబోతున్నారా? ఇక పార్టీలో అసలు కాంగ్రెస్ నేతలకు కీలక పద వులు కష్టమేనా? అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. ఇందుకు ప్రస్తుత రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రి యను ఉదహరిస్తున్నారు.
త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ నేతలకు సీటు దక్కకుండా తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయని చెప్పు కొంటున్నారు. పోటీలో ఉన్న అసలు కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టేలా వలస కాంగ్రెస్ నేతల పేర్లను తెరపైకి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగు తున్నది. మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తీవ్ర వివక్షకు, అన్యాయానికి గురవుతున్న అసలు కాంగ్రెస్ నేతలకు మరోసారి అన్యాయం జరగబోతున్నదని చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి పదవులు భర్తీ చేయాల్సి ఉన్నది. ప్రస్తుత పరిణామాలను బట్టి ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కే దక్కనున్నాయి. ఇందులో ఒక సీటు మరోసారి అభిషేక్ మను సింఘ్వీకే దాదాపు ఖరారైనట్టు తెలిసింది. దీంతో మిగిలిన ఒక్క సీటును దక్కించుకునేందుకు పార్టీలో ఆశావహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పలువురు అసలు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజ్యసభ రేసులోకి వచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశాలు దక్కకపోవడంతో రాజ్యసభ సీటైనా ఇవ్వండి అంటూ అధిష్ఠానానికి విన్నవించినట్టు సమాచారం. సీనియర్ నేతలు జీవన్రె డ్డి, వీ హనుమంతరావు, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్, కోదండరెడ్డితోపాటు మరికొందరు సీనియర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో తన పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని జీవన్‌రెడ్డి భావించగా ఢిల్లీ పెద్దలు అను గ్రహించలేదు. సంజయ్ రాకతో పుండుమీద కారం చల్లినట్టు అయ్యింది. దీంతో జీవన్‌రెడ్డి బాహాటంగానే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక విధంగా ఆయన పార్టీలో ప్రతిపక్షంగా మారారు. దీంతో ఆయన ఆగ్రహాన్ని చల్లార్చాలంటే ఏదో ఒక పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో సీని యర్ నేత వీహెచ్ తనకు చివరగా మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అధిష్ఠానానికి దగ్గరగా ఉండే మధుయాష్కీ, జగ్గారెడ్డి సైతం ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. కోదండరెడ్డి వంటి ఇంకొంత మంది సీనియర్లు తమకూ ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు.
రాజ్యసభ సీటు వేటలో ఉన్న అసలు కాంగ్రెస్ నేతలకు ముఖ్యనేత చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. వీరికి చెక్ పెట్టేలా, వీరికి వ్యతిరేకంగా వలస కాంగ్రెస్ నేతలను తెరపైకి తీసుకొచ్చినట్టు ప్రచారం జోరందుకున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చి ఢిల్లీకి పంపడం ద్వారా అక్కడ కూడా తనకు నమ్మకమైన వ్యక్తిని ఉంచవచ్చనే ఆలోచనలో ముఖ్యనేత ఉన్నట్టు చెప్పుకొంటున్నారు. ఒకవేళ వేం నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వ ప్రతిపాదనపై ఏవైనా అభ్యంతరాలు వస్తే ప్లాన్-బీ సైతం సిద్ధంగా ఉన్నట్టు గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది.
అధిష్ఠానం కాదనలేని పరిస్థితిని తీసుకొచ్చేలా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును తెరమీదికి తెస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ తరఫున సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అసలు కాంగ్రెస్ నేతలకు కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా తనకు ఇబ్బందిలేదనేలా ముఖ్యనేత వ్యవహరిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ నేతలను ఢిల్లీ గడప తొక్కకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు చెప్పుకొంటున్నారు.