Health tips : భారతీయ వంటకాల్లో చాలావరకు నెయ్యి (Ghee) తో చేసేవే ఉంటాయి. స్వీట్స్ (Sweets) నుంచి టిఫిన్స్ (Tiffins) వరకు ప్రతీది నెయ్యితో తినేవాళ్లు ఎక్కువగా ఉంటారు. నెయ్యితో ఆహారానికి అదనపు రుచి వస్తుంది. పప్పు, పచ్చడి, చపాతీ ఇలా ఏదైనా సరే నెయ్యి లేకుండా తినేందుకు చాలామంది ఇష్టపడరు. వాస్తవానికి రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వాస్తవానికి నెయ్యిలో ఎన్నో పోషకాలుంటాయి. నెయ్యి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు అందాన్ని కూడా పెంచుతుంది. అయితే గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లు నెయ్యిని ఎక్కువగా వాడొద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు.
అదేవిధంగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా నెయ్యిని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలతో బాధపడుతున్నవారు నెయ్యిని ఎక్కువగా తినకూడదని అంటున్నారు. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు నెయ్యిని ఎక్కువగా తింటే ఆ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని హెచ్చరిస్తున్నారు.
రక్తపోటు (బీపీ) సమస్యలు ఉన్నవాళ్లు కూడా నెయ్యిని దూరం పెట్టాలని నిపుణలు సలహా ఇస్తున్నారు. నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు రక్తపోటును పెంచుతాయని చెబుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్యలు ఉన్నప్పుడు నెయ్యిని తినకపోవడమే మంచిదని అంటున్నారు.
ఇక అధిక బరువు ఉన్నవాళ్లు, బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నవాళ్లు కూడా నెయ్యికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. నెయ్యి ఎక్కువగా తింటే మరింత బరువు పెరిగిపోతారని నిపుణులు అంటున్నారు. నెయ్యిలో కాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయని, అందువల్ల బరువు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మధుమేహం సమస్య ఉన్నవాళ్లు కూడా నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఉండే కొవ్వుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని, కాబట్టి షుగర్ పేషెంట్స్ నెయ్యికి దూరంగా ఉండాలని అంటున్నారు.